Last Updated:
UPS Pensioners Life Certificate: UPS కింద పింఛను పొందుతున్నవారు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి సంవత్సరం సమర్పించాల్సిన జీవిత ధృవీకరణ పత్రం (Life Certificate) కోసం నవంబర్ 30 చివరి తేదీగా ఉంది. ఈ గడువులోగా సర్టిఫికెట్ సమర్పించకపోతే నెలవారీ పింఛను చెల్లింపులపై ప్రభావం పడే అవకాశం ఉందని PFRDA సూచించింది.
ఏకీకృత పింఛను పథకం (UPS) కింద పింఛను పొందుతున్న వారికి బిగ్ అలర్ట్. ప్రతి సంవత్సరం సమర్పించాల్సిన జీవిత ధృవీకరణ పత్రం (Life Certificate) గడువు దగ్గరపడుతోంది. పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను నవంబర్ 30వ తేదీలోగా సమర్పించాలని పింఛను నిధుల నియంత్రణ సంస్థ PFRDA సూచించింది. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే నెలవారీ పింఛను చెల్లింపులపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ పని కోసం బ్యాంకులు లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆధార్, మొబైల్ ఫోన్‌లోని ఫేస్ అథెంటికేషన్ సదుపాయంతో ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు.
UPS జీవన్ సేతు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అంటే ఏంటి?
UPS పెన్షనర్లకు సులభంగా జీవిత ధృవీకరణ పత్రం అందించేందుకు PFRDA ‘UPS జీవన్ సేతు – డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్’ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా పెన్షనర్లు తాము జీవించి ఉన్నట్లు నిరూపించేందుకు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఈ ధృవీకరణ ద్వారా అర్హులైన వారికి పింఛను చెల్లింపులు కొనసాగుతాయి. గతంలో ఈ ప్రక్రియ కోసం బ్యాంకు లేదా సంబంధిత కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రోటీన్ ఈ-గవర్నమెంట్ సంస్థకు చెందిన NPS, UPS, APY మొబైల్ యాప్‌ల ద్వారా డిజిటల్ విధానంలో ఈ పని పూర్తి చేయవచ్చు. ఆధార్ ఆధారంగా గుర్తింపును నిర్ధారించి, ముఖ ధృవీకరణ ద్వారా పెన్షనర్ వివరాలను పరిశీలిస్తారు.
మొబైల్‌లోనే లైఫ్ సర్టిఫికెట్ ఎలా సమర్పించాలి?
ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే ముందు పెన్షనర్లు తమ PRAN (Permanent Retirement Account Number), పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, పెన్షన్ ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ కింది విధంగా ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ముందుగా మొబైల్‌లో NPS, UPS, APY యాప్‌లలో అందుబాటులో ఉన్న యాప్‌ను తెరవాలి. హోమ్ స్క్రీన్‌లో కనిపించే ‘UPS జీవన్ సేతు – డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం మీ PRAN నంబర్, పుట్టిన తేదీ నమోదు చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేసి ధృవీకరించాలి.
తర్వాత ఆధార్ ఆప్షన్‌ను ఎంచుకుని ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ‘Continue with Aadhaar’పై క్లిక్ చేసి ఆధార్ ధృవీకరణ పూర్తి చేయాలి. ఆపై ‘Face Authentication’ ఆప్షన్‌ను ఎంచుకుని, యాప్ సూచనల ప్రకారం ముఖాన్ని కెమెరా ముందు ఉంచాలి. ముఖ ధృవీకరణ విజయవంతమైతే సిస్టమ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను రూపొందిస్తుంది. దాని వివరాలను పరిశీలించి కన్ఫర్మ్ చేయాలి. చివరగా ‘Done’పై క్లిక్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది.
PFRDA సూచనల ప్రకారం UPS పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ 30లోగా తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఈ సర్టిఫికెట్ ఆధారంగానే పెన్షనర్ జీవించి ఉన్నారని సంబంధిత వ్యవస్థ నిర్ధారిస్తుంది. గడువులోగా సమర్పించకపోతే నెలవారీ హామీతో కూడిన పింఛను చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవడం మంచిది.
ఈ కొత్త డిజిటల్ సదుపాయం గురించి అర్హులైన పెన్షనర్లకు తెలియజేయాలని నోడల్ కార్యాలయాలకు కూడా PFRDA సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, కార్యాలయాలకు వెళ్లడం కష్టంగా ఉన్నవారు ఈ మొబైల్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే సర్టిఫికెట్ విజయవంతంగా జనరేట్ అయిందో లేదో నిర్ధారించుకుని, అవసరమైతే దాని రసీదు లేదా రిఫరెన్స్ వివరాలను భద్రపరుచుకోవాలి.

