1993లో కోకా-కోలా చేతికి…
1993లో కోకా-కోలా కంపెనీ గోల్డ్ స్పాట్‌ను తన బ్రాండ్ల జాబితాలో చేర్చుకుంది. అదే సమయంలో థమ్స్ అప్, లిమ్కా వంటి భారతీయ బ్రాండ్లు కూడా కోకా-కోలా చేతికి వెళ్లాయి. అయితే, తర్వాతి రోజుల్లో ఫాంటాపై ఎక్కువ దృష్టి పెట్టడంతో గోల్డ్ స్పాట్‌ను 2000లో మార్కెట్ నుంచి తప్పించారు. దీంతో ఈ డ్రింక్ దాదాపు 26 ఏళ్ల పాటు వినియోగదారులకు దూరమైంది. ఇప్పుడు పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తూ కోకా-కోలా ఈ బ్రాండ్‌ను తిరిగి తీసుకొచ్చింది.
ఈసారి గోల్డ్ స్పాట్‌ను కొన్ని మార్పులతో తీసుకొస్తున్నారు. గతంలో అందరికీ గుర్తుండిపోయిన పుల్లటి ఆరెంజ్ రుచిని అలాగే కొనసాగిస్తూ, తక్కువ చక్కెర ఉన్న డ్రింక్‌గా అందిస్తున్నారు. అలాగే, పాత బాటిల్ ప్యాక్‌కు బదులుగా ఆధునిక డిజైన్‌తో కూడిన క్యాన్‌లో విక్రయించనున్నారు. బ్రాండ్‌కు ఉన్న పాత గుర్తింపును అలాగే ఉంచుతూ కొత్త తరం వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ మార్పులు చేశారు. అయితే కొత్త గోల్డ్ స్పాట్‌లో 100 ఎంఎల్‌కు ఎంత చక్కెర ఉంటుంది? ఎన్ని క్యాలరీలు ఉంటాయి? వంటి పోషక విలువల వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
సుమేలి ఛటర్జీ ఏమన్నారంటే?
ఈ రీ ఎంట్రీపై కోకా-కోలా ఇండియా, సౌత్‌వెస్ట్ ఆసియా మార్కెటింగ్ విభాగంలో స్పార్క్లింగ్ ఫ్లేవర్స్ హెడ్‌గా ఉన్న సుమేలి ఛటర్జీ స్పందించారు. “గోల్డ్ స్పాట్ తాగుతూ పెరిగిన దాదాపు ప్రతి ఒక్కరికీ దానితో ఏదో ఒక జ్ఞాపకం ఉంటుంది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ అనుబంధం కొనసాగుతుండటమే ఈ బ్రాండ్ తిరిగి రావడాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తోంది. వినియోగదారులకు గుర్తుండిపోయిన అదే పుల్లటి ఆరెంజ్ రుచిని ఇప్పుడు క్యాన్‌లో అందిస్తున్నాం. మొదటిసారి తాగేవాళ్లకు కూడా ఒక్క సిప్ చాలు.. ఆ జింగ్ రుచి ఏంటో అర్థమవుతుంది. గోల్డ్ స్పాట్‌ను మళ్లీ స్వాగతించడం ఆనందంగా ఉంది. కొత్త తరం వినియోగదారులతో ఈ బ్రాండ్ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. ది జింగ్ థింగ్ ఈజ్ బ్యాక్!” అని ఆమె చెప్పారు.
గోల్డ్ స్పాట్ రీ లాంచ్‌లో భాగంగా కోకా-కోలా ముందుగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై దృష్టి పెట్టింది. బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, అమెజాన్ నౌ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ డ్రింక్ అందుబాటులోకి రానుంది. అంటే వినియోగదారులు తమకు నచ్చిన యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. పాత అభిమానులతో పాటు కొత్తగా ఈ డ్రింక్‌ను ప్రయత్నించాలనుకునే వారికి కూడా సులభంగా అందుబాటులోకి తీసుకురావాలన్నది కంపెనీ ఆలోచన. కొత్త క్యాన్ ధర, పరిమాణం, ప్రారంభంలో ఏయే నగరాల్లో అందుబాటులో ఉంటుందనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
భారత్‌లో ఆరెంజ్ ఫ్లేవర్ కూల్ డ్రింక్స్ మార్కెట్లో ఇప్పటికే ఫాంటా, మిరిండా వంటి బ్రాండ్లు ఉన్నాయి. వీటితో పాటు కొత్తగా వస్తున్న పానీయాల బ్రాండ్ల నుంచి కూడా పోటీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గోల్డ్ స్పాట్‌ను మళ్లీ తీసుకురావడం కోకా-కోలా వ్యాపార వ్యూహంలో భాగంగా చూడొచ్చు. పాత బ్రాండ్‌కు ఉన్న గుర్తింపును ఉపయోగించుకోవడంతో పాటు, తక్కువ చక్కెర ఉన్న పానీయాలను కోరుకునే వినియోగదారులను ఆకట్టుకోవాలని కంపెనీ చూస్తోంది. ఇటీవల వినియోగదారుల్లో లో షుగర్, నో షుగర్ డ్రింక్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. కోకా-కోలా కూడా తన పానీయాల్లో ఈ విభాగంపై ఎక్కువ దృష్టి పెడుతోంది. ఈ మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే గోల్డ్ స్పాట్‌ను కొత్త రూపంలో తీసుకొచ్చింది.
మొత్తానికి, 1952లో ప్రారంభమై ఒక తరం ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయిన గోల్డ్ స్పాట్.. ఇప్పుడు కొత్త రూపంలో మళ్లీ మార్కెట్లోకి వచ్చింది. పాత రుచిని గుర్తు చేస్తూనే తక్కువ చక్కెర, కొత్త క్యాన్ ప్యాక్, క్విక్ కామర్స్ విక్రయాల ద్వారా కొత్త తరం వినియోగదారులకు చేరువ కావాలని కోకా-కోలా భావిస్తోంది. ఈ రీ ఎంట్రీకి మార్కెట్లో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
