Last Updated:
సాధారణ మినప గారెలతో పాటు అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి చేసే అల్లం గారెలు కూడా ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని బయట కరకరలాడేలా, లోపల మెత్తగా, గుల్లగా వచ్చేలా తయారు చేసుకోవచ్చు. గ్రైండర్ లేకపోయినా ఇంట్లో ఉండే చిన్న మిక్సీతోనే వీటిని సులభంగా తయారు చేయవచ్చు.
హిందూ సంప్రదాయంలో పండుగలు, పూజల సమయంలో వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. సాధారణ మినప గారెలతో పాటు అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి చేసే అల్లం గారెలు కూడా ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని బయట కరకరలాడేలా, లోపల మెత్తగా, గుల్లగా వచ్చేలా తయారు చేసుకోవచ్చు. గ్రైండర్ లేకపోయినా ఇంట్లో ఉండే చిన్న మిక్సీతోనే వీటిని సులభంగా తయారు చేయవచ్చు. అయితే పిండి మరీ పలుచగా కాకుండా, సరైన మోతాదులో నీటిని ఉపయోగించడం ముఖ్యం.
కావలసిన పదార్థాలు
అల్లం గారెల తయారీకి ఒక కప్పు పొట్టు మినప్పప్పు, ఒక అంగుళం అల్లం ముక్క, రెండు పచ్చిమిరపకాయలు, అర టీస్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకు అవసరం. పప్పు రుబ్బడానికి కొద్దిగా చల్లటి నీటిని, గారెలను వేయించడానికి సరిపడా వంట నూనెను సిద్ధం చేసుకోవాలి. ఈ గారెలకు వంటసోడా వేయాల్సిన అవసరం లేదు. పిండిని సరైన పద్ధతిలో రుబ్బితేనే గారెలు మంచి షేప్లో వస్తాయి.
అల్లం గారెల తయారీ విధానం
ముందుగా పొట్టు మినప్పప్పును నీటితో ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత తగినంత నీరు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. పప్పు బాగా నానిన తర్వాత మరోసారి కడిగి నీటిని పూర్తిగా వంపేయాలి. అనంతరం జల్లెడలో వేసి సుమారు 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల పప్పులోని అదనపు నీరు బయటకు వెళ్లిపోతుంది.
ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసి నీరు పోయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో నానబెట్టిన మినప్పప్పును కొద్దికొద్దిగా వేసి రుబ్బాలి. మొదట నీరు పోయకుండా గ్రైండ్ చేసి, అవసరమైతే చల్లటి నీటిని కొద్దికొద్దిగా చిలకరిస్తూ గట్టిగా ఉండేలా పిండి తయారు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీరు పోస్తే పిండి పలుచగా మారి గారెలు సరిగ్గా రాకపోవచ్చు.
తయారైన పిండిలో అల్లం, పచ్చిమిర్చి మిశ్రమం, సన్నగా తరిగిన కరివేపాకు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కడాయిలో నూనె వేడి చేయాలి. చేతులను కొద్దిగా నీటితో తడిపి, పిండిని చిన్న ముద్దగా తీసుకుని గుండ్రంగా చేసి మధ్యలో రంధ్రం పెట్టాలి. నూనె వేడెక్కిన తర్వాత గారెలను జాగ్రత్తగా అందులో వేయాలి. మంటను మీడియంలో ఉంచి, రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత జల్లెడ గరిటెతో తీసి అదనపు నూనె పోయేలా చూడాలి.
అంతే.. వేడివేడి అల్లం గారెలు సిద్ధం! అల్లం ఘాటు, పచ్చిమిర్చి రుచి, జీలకర్ర సువాసనతో ఈ గారెలు ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. అయితే నూనె మరీ వేడిగా ఉన్నప్పుడు గారెలు బయట త్వరగా రంగు మారి లోపల పచ్చిగా ఉండవచ్చు. అందుకే మంటను నియంత్రిస్తూ నిదానంగా వేయించడం ముఖ్యం. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఇంట్లోనే రుచికరమైన, కరకరలాడే అల్లం గారెలను సులభంగా తయారు చేసుకోవచ్చు.

