Last Updated:
అలీ, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో చలపతి కుమార్ పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మన డాక్టర్ బాబే’. నవంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం లా ఉందొ చూద్దామా..
శరణ్య, సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ పతాకంపై కృతాక్షి నిర్మించిన తాజా చిత్రం ‘మన డాక్టర్ బాబే’. చలపతి కుమార్ పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా శ్రీ స్కంద హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. మోహన సిద్ధి, శ్రుతి శంకర్ హీరోయిన్లుగా నటించగా, అలీ, రాజీవ్ కనకాల, శాంతి, కోటేశ్వరరావు కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో రివ్యూలో చూద్దాం.
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన రాజు (శ్రీ స్కంద) అంటే మేనమామ దుర్గారావు (రాజీవ్ కనకాల)కు పెద్దగా ఇష్టం ఉండదు. తన కూతురు సింధు (శ్రుతి శంకర్)ను పెళ్లి చేసుకోవాలంటే డాక్టర్ కావాలని దుర్గారావు షరతు పెడతాడు. మరదలిపై ప్రేమతో రాజు కష్టపడి చదివి డాక్టర్ అవుతాడు. అయితే రాజు ‘ఆండ్రాలజిస్ట్’ కావడంతో, ఆ పేరును తొలగిస్తేనే కూతురిని ఇస్తానని మామ మరో మెలిక పెడతాడు. దీనికి రాజు ఎందుకు ఒప్పుకోలేదు? అసలు అతను ఆండ్రాలజిస్ట్ కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ క్రమంలో డాక్టర్ సుఖం (అలీ), గౌతమి (మోహన సిద్ధి), తాత రత్నం (కోటేశ్వరరావు)ల పాత్రలేంటి? అనేది వెండితెరపై చూడాల్సిందే.
పల్లెటూరి నేపథ్యం, మేనమామ-మరదలు అనుబంధాల చుట్టూ అల్లుకున్న ఈ కథను దర్శకుడు చలపతి కుమార్ పువ్వల ఎంతో సహజంగా తెరకెక్కించారు. ఆండ్రాలజిస్ట్ అనే సున్నితమైన అంశాన్ని తీసుకున్నప్పటికీ, అడల్ట్ కంటెంట్ ఎక్కడా హద్దు దాటకుండా కుటుంబమంతా కలిసి చూసేలా చక్కటి వినోదాన్ని పంచారు. ఫస్టాఫ్ అంతా రాజు, గౌతమి, సింధు ట్రాక్‌లతో పాటు ఆండ్రాలజిస్ట్ చుట్టూ తిరిగే కామెడీతో సరదాగా సాగిపోతుంది. కొన్ని సన్నివేశాలు బోరింగ్ ఫీల్ తెప్పించినా ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. హీరో ఎదుర్కొనే సమస్య, క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
తొలి సినిమానే అయినా శ్రీ స్కంద కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాల్లో ఎంతో పరిణతితో నటించాడు. మోహన సిద్ధి, శ్రుతి శంకర్ గ్లామర్‌తో పాటు నటనతోనూ మెప్పించారు. రాజీవ్ కనకాల, కోటేశ్వరరావు, శాంతి తమ పాత్రలకు న్యాయం చేశారు. సెకండాఫ్‌లో అలీ కామెడీ బాగా వర్కౌట్ అయింది. సాంకేతికంగా కిషోర్ బోయిడపు సినిమాటోగ్రఫీ, మనోజ్ కుమార్ సంగీతం మరియు బీజీఎం సినిమాకు ప్లస్ అయ్యాయి. సెల్వ కుమార్ ఎడిటింగ్ నీట్‌గా ఉంది. రామకృష్ణ గరగ అందించిన కథ, మాటలతో పాటు రాంబాబు గోశాల, గిరిధర్ రాగోలు, విష్ణు ఎర్రావుల, శర్వణై సిరి రాసిన పాటలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా చెప్పాలంటే.. నవ్వులు, భావోద్వేగాలతో కూడిన చక్కటి ఫ్యామిలీ సినిమా మన డాక్టర్ బాబే.
రేటింగ్ : 2.75

