Last Updated:
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో అర్ధరాత్రి పెను విషాదం చోటుచేసుకుంది.
నవరాత్రి ఉత్సవాల వేళ శీత్లా మాత ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులపైకి నియంత్రణ కోల్పోయిన లారీ వేగంగా దూసుకెళ్లింది. ఈ భయానక ప్రమాదంలో కనీసం 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, సుమారు 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది పాదయాత్రగా అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భక్తులే ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసు అధికారుల కథనం ప్రకారం.. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఛినోర్ వైపు నుంచి వరి ధాన్యంతో ఓవర్‌లోడ్‌తో వస్తున్న భారీ లారీ నిటారైన లోతువాలు ఉన్న రోడ్డు వద్ద అదుపు తప్పింది. వాస్తవానికి భారీ వాహనాల రాకపోకలపై ఆ మార్గంలో నిషేధం ఉన్నప్పటికీ, సదరు లారీ పోలీసు బారికేడ్లను, చెక్‌పోస్టును బలంగా ఢీకొంటూ శీత్లా మాత ఆలయం వైపు దూసుకొచ్చింది. వేగంగా వచ్చిన ఆ వాహనం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న భక్తులు, చిరు వ్యాపార దుకాణాల మీదుగా దూసుకెళ్లి, ఆలయ ప్రహరీ గోడను, ప్రధాన గేటును ధ్వంసం చేస్తూ ఆగిపోయింది. వాహనం కింద నలిగిపోయి పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన జరిగిన వెంటనే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గ్వాలియర్ కలెక్టర్ రుచికా చౌహాన్, సీనియర్ ఎస్పీ ధర్మవీర్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సులు, ఇతర సహాయక వాహనాలను రప్పించి క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. మొత్తం 39 మందిని ఆసుపత్రికి తరలించగా, వారిలో 12 మంది మరణించినట్లు నిర్ధారించారు. క్షతగాత్రుల్లో ఐదారుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, పలువురికి ఎముకలు విరగడం వంటి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు నిరంతరం సీటీ స్కాన్‌లు, ఎక్స్-రేలు తీస్తూ నిపుణులైన వైద్య బృందం చికిత్స అందిస్తోందని కలెక్టర్ తెలిపారు.
నవరాత్రి రద్దీ దృష్ట్యా పోలీసు చెక్‌పోస్టులు, స్టాపర్లు ఏర్పాటు చేసి భారీ వాహనాలను నిషేధించినప్పటికీ, ఆ లారీ లోపలికి ఎలా ప్రవేశించిందనే అంశంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. లారీలో సాంకేతిక లోపం తలెత్తిందా లేక బ్రేకులు ఫెయిల్ అయ్యాయా అనే విషయాన్ని తేల్చేందుకు ఆర్టీవో (RTO) సాంకేతిక బృందాన్ని రప్పించి వాహనాన్ని తనిఖీ చేయిస్తున్నారు. ప్రమాద స్థలంలో భక్తుల హాహాకారాలతో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.

