Last Updated:
హైదరాబాద్ వంటకాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. బిర్యానీ, హలీమ్, ఖుబానీ కా మీఠా వంటి ప్రసిద్ధ వంటకాలతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని సంప్రదాయ వంటకాలు కూడా హైదరాబాద్ సంస్కృతిలో భాగంగా ఉన్నాయి.
హైదరాబాద్ వంటకాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. బిర్యానీ, హలీమ్, ఖుబానీ కా మీఠా వంటి ప్రసిద్ధ వంటకాలతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని సంప్రదాయ వంటకాలు కూడా హైదరాబాద్ సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి షాహీ తల్బీనా. బార్లీ, పాలు, ఖర్జూరాలు, తేనె, డ్రై ఫ్రూట్స్‌తో తయారయ్యే ఈ ప్రత్యేక వంటకం శరీరానికి శక్తినివ్వడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో అల్పాహారంగా దీనిని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
-బార్లీ గంజి – 4 టేబుల్ స్పూన్లు (రాత్రంతా లేదా కనీసం 2 గంటలు నానబెట్టినది)
-ఫుల్ క్రీమ్ పాలు – 3 కప్పులు
-అజ్వా లేదంటే సుక్రీ ఖర్జూరం – 1 (తరిగినది)
-స్వచ్ఛమైన తేనె – 2 టేబుల్ స్పూన్లు
-బాదం, జీడిపప్పు, పిస్తా – 2 టేబుల్ స్పూన్లు (తరిగినవి)
-యాలకుల పొడి – కొద్దిగా
-కుంకుమపువ్వు – 5 నుంచి 6 రేకులు
ముందుగా మందపాటి అడుగు ఉన్న గిన్నె తీసుకుని అందులో పాలను మరిగించాలి. పాలు వేడెక్కిన తర్వాత ముందుగా నానబెట్టిన బార్లీని వడగట్టి పాలలో వేయాలి. తక్కువ మంటపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బార్లీ పూర్తిగా మెత్తబడుతూ పాలలో కలిసిపోయి చిక్కగా మారే వరకు ఉడికించాలి.
ఆ తర్వాత తరిగిన ఖర్జూరాలు, కొద్దిగా పాలలో నానబెట్టిన కుంకుమపువ్వును కలపాలి. దీంతో తల్బీనాకు అందమైన బంగారు రంగుతో పాటు ప్రత్యేకమైన సువాసన వస్తుంది. మరో ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత యాలకుల పొడి, సగం మొత్తంలో తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. పూర్తిగా మరిగిన వెంటనే తేనె వేయకుండా, కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే తేనె కలపాలి. ఇలా చేయడం వల్ల తేనెలోని సహజ పోషక గుణాలు నిల్వ ఉంటాయి.
హైదరాబాద్ రాజ కుటుంబాల వంటకాల శైలిలో ఈ తల్బీనాను మట్టి కుండలో లేదంటే గాజు గిన్నెలో వడ్డిస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. పైభాగంలో పిస్తా, బాదం పలుకులు, జీడిపప్పుతో అలంకరించవచ్చు. ప్రత్యేక సందర్భాల్లో సిల్వర్ ఫాయిల్‌తో అలంకరిస్తే మరింత రాజసంగా కనిపిస్తుంది. వేసవి కాలంలో దీనిని రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో చల్లబరిచి వడ్డిస్తే మరింత రుచిగా ఉంటుంది. చల్లటి షాహీ తల్బీనా శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
బార్లీలో ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఖర్జూరాలు సహజ చక్కెరలు, ఐరన్, ఖనిజలవణాలను అందిస్తాయి. పాలు కాల్షియం, ప్రోటీన్‌కు మంచి మూలం కాగా, డ్రై ఫ్రూట్స్ శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, విటమిన్లు అందిస్తాయి. తేనె సహజ శక్తిని అందించడంలో సహాయపడుతుంది. ఈ పదార్థాలన్నీ కలిసిన షాహీ తల్బీనా పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరికీ పోషకాహారంగా ఉపయోగపడుతుంది. రుచి, ఆరోగ్యం రెండింటినీ సమపాళ్లలో అందించే హైదరాబాద్ స్పెషల్ షాహీ తల్బీనా ఇంట్లో సులభంగా తయారు చేసుకునే అద్భుతమైన సంప్రదాయ వంటకం. ఒకసారి తయారు చేసి రుచి చూస్తే ఈ ప్రత్యేక అల్పాహారం మీ కుటుంబానికి కూడా ఇష్టమైన వంటకంగా మారడం ఖాయం.
Hyderabad,Telangana
Jul 14, 2026 11:48 AM IST

