ఇటీవల ఈ అల్గారిథమ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో కొద్దిసేపు కనిపించకుండా పోయింది. అనంతరం ఆ వీడియోను పొరపాటున తొలగించినట్లు మెటా అంగీకరించి, తిరిగి పునరుద్ధరించడంతో పాటు క్షమాపణలు కూడా తెలిపింది. దీంతో మెటా అల్గారిథమ్ ఎలా పనిచేస్తుంది? ఒక పోస్ట్ ఎందుకు కనిపిస్తుంది? ఎందుకు కనిపించదు? అనే ప్రశ్నలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
న్యూస్18 హిందీ వెల్లడించిన కథనం ప్రకారం.. మెటా కేవలం ఒకే అల్గారిథమ్‌ను ఉపయోగించదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, రీల్స్, ఎక్స్‌ప్లోర్ పేజీ, థ్రెడ్స్ వంటి ప్రతి విభాగానికి వేర్వేరు అల్గారిథమ్‌లు పనిచేస్తుంటాయి. అయితే వాటి ప్రధాన లక్ష్యం మాత్రం ఒక్కటే. ప్రతి వినియోగదారుడు ఎక్కువగా ఆసక్తి చూపే కంటెంట్‌ను ముందుగా చూపించడం. అంటే మీ అభిరుచులు, గతంలో మీరు చూసిన కంటెంట్ ఆధారంగా మీకు నచ్చే పోస్టులను ఎంపిక చేసి చూపించడం ఈ వ్యవస్థ పని.
చాలామంది ఇది ఒక మాయా వ్యవస్థ అనుకుంటారు. కానీ నిజానికి ఇది అత్యంత వేగంగా పనిచేసే AI ఆధారిత “రికమెండేషన్ ఇంజిన్”. మీరు చేసే ప్రతి చర్యను ఇది గమనిస్తూ ఉంటుంది. మీరు ఏ పోస్ట్‌కు లైక్ ఇచ్చారు, ఏ వీడియోను పూర్తిగా చూశారు, ఏ రీల్‌ను మధ్యలోనే స్కిప్ చేశారు, ఏ పోస్టును షేర్ చేశారు, ఏదిని సేవ్ చేసుకున్నారు, ఏ కంటెంట్‌పై ఎక్కువ సమయం గడిపారు వంటి ప్రతి సమాచారాన్ని విశ్లేషిస్తుంది. ఈ వివరాలన్నింటినీ ఉపయోగించి, తర్వాత మీరు యాప్ తెరిచినప్పుడు ముందుగా ఏ పోస్టు చూపించాలి, ఏది తర్వాత చూపించాలి అనే విషయాన్ని AI నిర్ణయిస్తుంది. అందుకే ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఫేస్‌బుక్ తెరిచినా వారి ఫీడ్ పూర్తిగా వేర్వేరుగా కనిపిస్తుంది.
ఉదాహరణకు మీరు ఉదయం 8 గంటలకు ఫేస్‌బుక్ ఓపెన్ చేశారని అనుకుందాం. యాప్ తెరిచిన వెంటనే, మీకు చూపించే అవకాశం ఉన్న అన్ని పోస్టులను మెటా ముందుగా ఒకచోట సేకరిస్తుంది. దీనినే “ఇన్వెంటరీ (Inventory)” అని పిలుస్తుంది. ఈ జాబితాలో మీ స్నేహితుల పోస్టులు, మీరు ఫాలో అయ్యే పేజీలు, మీరు సభ్యులుగా ఉన్న గ్రూపుల్లోని పోస్టులు, స్పాన్సర్డ్ ప్రకటనలు, AI సిఫార్సు చేసిన పోస్టులు, రీల్స్, వైరల్ వీడియోలు వంటి అన్ని రకాల కంటెంట్ ఉంటుంది. ఒక హోటల్ కస్టమర్‌కు మెనూ అందించినట్లే, మెటా కూడా మీకు చూపించగల అన్ని పోస్టుల జాబితాను సిద్ధం చేస్తుంది.
పోస్టుల జాబితా సిద్ధమైన తర్వాత అసలు పని ప్రారంభమవుతుంది. ప్రతి పోస్టును వేలాది సంకేతాల (Signals) ఆధారంగా మెటా పరిశీలిస్తుంది. ఉదాహరణకు ఆ పోస్టును ఎవరు చేశారు? ఆ వ్యక్తితో మీకు ఎంత పరిచయం ఉంది? ఆ పోస్టు ఎంతసేపటి క్రితం అప్‌లోడ్ అయింది? దానికి ఎంతమంది లైక్ చేశారు? ఎన్ని కామెంట్లు వచ్చాయి? ఎంతమంది షేర్ చేశారు? వంటి అంశాలను AI పరిశీలిస్తుంది. అంతేకాదు, మీరు మొబైల్‌లో చూస్తున్నారా? లేక కంప్యూటర్‌లో చూస్తున్నారా? మీ ఇంటర్నెట్ వేగం ఎంత ఉంది? ప్రస్తుతం సమయం ఎంత? ఇటీవల మీరు ఏ తరహా పోస్టులను ఎక్కువగా చూశారు? వంటి అనేక వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. చిన్న విషయాల నుంచి పెద్ద వివరాల వరకు ప్రతి సమాచారం అల్గారిథమ్‌కు ఒక సంకేతంగా పనిచేస్తుంది.
మెటా AI మీ మనసును చదవదు. కానీ మీ గత అలవాట్ల ఆధారంగా మీరు తర్వాత ఏమి చూడాలనుకుంటారో అంచనా వేస్తుంది. ఉదాహరణకు, మీరు ప్రతిరోజూ క్రికెట్ వీడియోలు చూస్తుంటే, విరాట్ కోహ్లీ లేదా శుభ్‌మన్ గిల్‌కు సంబంధించిన కొత్త రీల్ వచ్చినప్పుడు అది మీకు నచ్చే అవకాశం ఎక్కువగా ఉందని AI భావిస్తుంది. అలాగే మీరు తరచూ స్టాక్ మార్కెట్ వార్తలు చదివితే, ఆర్థిక వార్తలు, పెట్టుబడులపై పోస్టులు మీ ఫీడ్‌లో ఎక్కువగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మీరు ఎప్పుడూ ఫాలో చేయని వ్యక్తి చేసిన వీడియో కూడా మీ అభిరుచులకు సరిపోతుందని AI భావిస్తే, ఆ వీడియోను కూడా మీ ఫీడ్‌లో చూపిస్తుంది. అందుకే కొత్త క్రియేటర్ల కంటెంట్ కూడా చాలామందికి వైరల్ అవుతుంది.
ప్రతి పోస్టును పరిశీలించిన తర్వాత, దానికి మెటా ఒక “రిలవెన్స్ స్కోర్ (Relevance Score)” కేటాయిస్తుంది. ఈ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, ఆ పోస్టు మీ ఫీడ్‌లో అంత పైభాగంలో కనిపిస్తుంది. ఈ స్కోర్ నిర్ణయించేటప్పుడు AI అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. మీరు ఆ పోస్టును లైక్ చేసే అవకాశం ఎంత ఉంది? కామెంట్ చేసే అవకాశం ఉందా? పూర్తిగా చూసే అవకాశముందా? సేవ్ చేసుకుంటారా? షేర్ చేస్తారా? వంటి అనేక అంశాలపై సంభావ్యత (Probability) లెక్కిస్తుంది. ఈ అంచనాల ఆధారంగానే పోస్టులకు స్కోర్ ఇస్తుంది. అంటే ఒక పోస్టు మీకు ఉపయోగకరంగా ఉంటుందని AI భావిస్తే, దానికి ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది. ఉపయోగం తక్కువగా ఉంటుందని భావిస్తే, అది ఫీడ్‌లో కిందకు వెళ్లిపోవచ్చు లేదా అసలు కనిపించకపోవచ్చు.
చాలామంది ఒక పోస్టుకు ఎక్కువ లైక్‌లు వస్తేనే అది వైరల్ అవుతుందని అనుకుంటారు. కానీ ప్రస్తుతం మెటా అల్గారిథమ్ కేవలం లైక్‌లను మాత్రమే ఆధారంగా తీసుకోదు. ముఖ్యంగా వాచ్ టైమ్ (Watch Time)కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఒక వీడియోను ఎక్కువ మంది పూర్తిగా చూస్తే, అది నాణ్యమైన కంటెంట్‌గా AI భావిస్తుంది. అదే వీడియోను చాలామంది రెండు లేదా మూడు సెకన్లలోనే స్కిప్ చేస్తే, ఆ వీడియో రీచ్ క్రమంగా తగ్గుతుంది. అలాగే ఎక్కువగా షేర్ అయ్యే పోస్టులు కూడా ఎక్కువ మందికి చేరుతాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టును సేవ్ (Save) చేయడం చాలా బలమైన సానుకూల సంకేతంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఆ కంటెంట్‌ను తర్వాత మళ్లీ చూడాలనుకుంటున్నారని అల్గారిథమ్ అర్థం చేసుకుంటుంది.
కామెంట్లు కూడా మెటా అల్గారిథమ్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే అన్ని కామెంట్లకు ఒకే విలువ ఉండదు. “వావ్”, “గుడ్”, “నైస్” వంటి చిన్న కామెంట్ల కంటే, పోస్టుకు సంబంధించిన అర్థవంతమైన చర్చ జరిగే కామెంట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అలాంటి పోస్టులను మరింత ఎక్కువ మందికి చూపించే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే, మెటా అల్గారిథమ్ లక్ష్యం వినియోగదారులు ఎక్కువసేపు ప్లాట్‌ఫారమ్‌లో గడపడానికి ఆసక్తికరమైన, ఉపయోగకరమైన కంటెంట్‌ను అందించడం. అందుకే ప్రతి యూజర్‌కు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ భిన్నంగా కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి లైక్, షేర్, కామెంట్, సేవ్, వీడియో వీక్షణ భవిష్యత్తులో మీకు కనిపించే కంటెంట్‌ను ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి.
