Last Updated:
విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి, ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత స్టార్ హీరోల పొలిటికల్ ఎంట్రీలపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హీరో సూర్య పొలిటికల్ ఎంట్రీ అనే న్యూస్ బయటకు రాగా, తాజాగా దీనిపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల రాజకీయ ఆరంగేట్రం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. దళపతి విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి, ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత ఈ చర్చ మరింత ఊపందుకుంది. విజయ్ బాటలోనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సూర్య ఎప్పటినుంచో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే, ఎట్టకేలకు ఈ రాజకీయ ప్రవేశం రూమర్లపై హీరో సూర్య ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
చెన్నైలో జరిగిన తన తాజా చిత్రం ‘సీన్’ విజయోత్సవ సభలో పాల్గొన్న సూర్య, తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలకు బ్రేక్ వేశారు. తనకు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కానీ, ప్రణాళికలు కానీ లేవని ఆయన తేల్చి చెప్పారు. “నేను రాజకీయాల్లోకి రావడం లేదు. అయితే, అంతమాత్రాన నాకు రాజకీయాలంటే ద్వేషం అని కాదు. దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశ్శబ్దంగా, నిశితంగా గమనిస్తున్నాను” అని సూర్య స్పష్టం చేశారు. అలాగే, రాజకీయ వ్యవస్థపై, ప్రజల సమస్యలపై పూర్తి స్థాయి అవగాహన, బాధ్యత లేకుండా ఆ రంగంలోకి అడుగుపెట్టబోనని ఆయన అభిప్రాయపడ్డారు.
సూర్య ‘అగరం ఫౌండేషన్’ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సేవా కార్యక్రమాలను రాజకీయ ఉద్దేశ్యాలతో చేయడం లేదని, అది కేవలం తన సామాజిక బాధ్యత మాత్రమేనని సూర్య పరోక్షంగా వెల్లడించారు. సమాజంలో అవినీతిని అంతం చేయాలంటే ఎవరో మూడో వ్యక్తి రావడం కాదు, ప్రతి ఒక్కరూ తమలోని నిజాయితీతో పని చేయాలని యువతకు సూచించారు.
మరోవైపు, సూర్య నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ‘సీన్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. మలయాళ హిట్ డైరెక్టర్ జీతూ మాధవన్ (ఆవేశం, రోమాంచం ఫేమ్) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2D ఎంటర్టైన్మెంట్స్, ఝగారం స్టూడియోస్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. దీపావళి కానుకగా నవంబర్ 6న విడుదలైన ఈ చిత్రంలో నజ్రియా నజీమ్, మలయాళ నటుడు నస్లెన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇన్బరాజ్ అనే పోలీస్ ఆఫీసర్‌గా సూర్య తనదైన నటనతో అదరగొట్టారు. కలెక్షన్ల పరంగా చూసుకుంటే.. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 116 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సత్తా చాటింది. ఇక మూడో రోజు నాటికి భారతదేశంలో దీని నికర వసూళ్లు రూ. 62.75 కోట్లుగా నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

