దేశంలోని చాలా అడవులను ప్రభుత్వం పర్యావరణం, వన్యప్రాణులను కాపాడేందుకు నిర్వహిస్తోంది. అదే సమయంలో గిరిజనులు, తరతరాలుగా అడవులపై ఆధారపడి జీవిస్తున్న ఇతర సంప్రదాయ వర్గాలకు తమ జీవనాధారం కోసం ఈ ప్రాంతాల్లోని అటవీ ఉత్పత్తులను సేకరించే హక్కులు ఉన్నాయి. 2006లో ప్రభుత్వం షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) యాక్ట్‌ను తీసుకొచ్చింది. దీనినే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని కూడా అంటారు. ఈ చట్టం ప్రకారం చిన్న అటవీ ఉత్పత్తుల్లో వెదురు, బ్రష్‌వుడ్, చెట్ల మొదళ్లు, బెత్తం, టస్సర్, కోకూన్లు, తేనె, మైనం, లాక్, తేండు లేదా కెండు ఆకులు, ఔషధ మొక్కలు, మూలికలు, వేర్లు, దుంపలు వంటి కలప కాని అటవీ ఉత్పత్తులు ఉంటాయి. PMJVM కింద 87 రకాల చిన్న అటవీ ఉత్పత్తులకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించింది. గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్, అభివృద్ధి కోసం పనిచేసే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TRIFED), మార్కెట్ ధర ఎంత ఉన్నా ముందే నిర్ణయించిన కనీస మద్దతు ధరకు కలప కాని అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం గిరిజన అభివృద్ధి సహకార సంస్థలు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు వంటి రాష్ట్ర స్థాయి అమలు సంస్థల నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తోంది. 2013-14 నుంచి ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాలు 2,67,954 మెట్రిక్ టన్నుల చిన్న అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేశాయి. వీటి విలువ రూ.693.98 కోట్లు. (ప్రతీకాత్మక చిత్రం)
