Last Updated:
ఆదిలాబాద్ లో అల్లనేరేడు పండ్లు విరివిగా కాసి, కిలో ధర 150-200 రూపాయలు, పెద్దలు దీన్ని కరువు సంకేతంగా చూస్తుండగా శాస్త్రవేత్తలు వాతావరణ ఒత్తిడి కారణమని చెబుతున్నారు
ప్రస్తుతం ఎటు చూసినా అల్లనేరేడు పండ్లే కనిపిస్తున్నాయి. మార్కెట్లలో పెద్ద ఎత్తున విక్రయాలు జరుగుతుండగా, గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా ఈసారి దాదాపు ప్రతి చెట్టూ పండ్లతో కళకళలాడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో కిలో అల్లనేరేడు పండ్లు రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. అయితే ఈసారి పుష్కలంగా కాసిన అల్లనేరేడు పండ్లపై సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. అల్లనేరేడు పండ్లు అసాధారణంగా ఎక్కువగా కాస్తే కరువు వచ్చే అవకాశాలు ఉంటాయి అనే పాత నమ్మకం మళ్లీ వైరల్ అవుతోంది. దీంతో ఇందులో ఎంత నిజం ఉంది? శాస్త్రం ఏమి చెబుతోంది? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
సాధారణంగా జూన్, జులై నెలల్లో ఎక్కువగా కనిపించే అల్లనేరేడు పండ్లు ఈసారి ఏప్రిల్, మే నెలల నుంచే మార్కెట్లలో దర్శనమిచ్చాయి. అంతేకాదు, గతంలో పెద్దగా పండ్లు కాయని చెట్లకూ ఈ ఏడాది విరివిగా పంట రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆకుపచ్చని చెట్ల మధ్య నల్లగా మెరిసే ఈ పండ్లు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండగా, చెట్టు ఆకులు, బెరడు కూడా ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే పెద్దలు మాత్రం ఈ పరిస్థితిని మరో కోణంలో చూస్తున్నారు. వేసవిలో అల్లనేరేడు చెట్లు అసాధారణంగా ఎక్కువగా కాసి, పండ్లు విరివిగా రాలితే ఆ ఏడాది వర్షాభావం లేదా కరువు వచ్చే అవకాశాలు ఉంటాయని తరతరాలుగా చెబుతున్న నమ్మకాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించడం కూడా ఈ చర్చకు మరింత బలం చేకూర్చుతోంది.
మరోవైపు శాస్త్రవేత్తలు మాత్రం దీనికి భిన్నమైన వివరణ ఇస్తున్నారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, భూగర్భ జలాల కొరత, పర్యావరణ ఒత్తిడి వంటి పరిస్థితుల్లో చెట్లు తమ జీవన చక్రంలో భాగంగా ఎక్కువ పండ్లు, విత్తనాలు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి డా. మల్లేష్ మాట్లాడుతూ.. వాతావరణ ఒత్తిడి కారణంగా అల్లనేరేడు చెట్లు ఎక్కువగా కాయొచ్చని, అయితే దీనిని కరువుకు నేరుగా సంకేతంగా చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
ప్రకృతిలో జరిగే ప్రతి మార్పుకు ఒక కారణం ఉంటుందని, మన పెద్దలు అనుభవంతో చెప్పిన అనేక విషయాలు కొన్నిసార్లు ఆధునిక శాస్త్రం వివరించే అంశాలతో సరిపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇలాంటి నమ్మకాలపై భయపడకుండా, ప్రకృతిలోని మార్పులను గమనిస్తూ నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ ఈసారి మార్కెట్లలో పుష్కలంగా లభిస్తున్న అల్లనేరేడు పండ్లు వినియోగదారులకు మంచి అవకాశం తీసుకొచ్చాయి. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదేనని వైద్యులు సూచిస్తున్నారు. కరువు వస్తుందా రాదా అన్నది కాలమే నిర్ణయించాలి.. కానీ ప్రకృతి ఇచ్చే ప్రతి సంకేతాన్ని అర్థం చేసుకుని వనరులను సంరక్షించుకోవడం మాత్రం మనందరి బాధ్యతే.
Adilabad,Telangana
Jun 30, 2026 10:14 PM IST
