Last Updated:
Fake Currency: ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తారు కొంతమంది. అలాంటి ఇద్దరు కలిసి వేసిన ప్లాన్ ఇది. వారు ఏం చేస్తున్నారో చూడండి.
రాజు, సురేష్.. ఈ ఇద్దరూ పని పాటా లేకుండా ఖాళీగా తిరిగేవారు. కష్టపడి పనిచెయ్యడం ఇష్టం ఉండదు. ఈజీగా మనీ వచ్చేయాలి అనుకునే రకం. అందుకోసం ఉన్న అడ్డదారుల్ని పరిశీలించారు. నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తే.. ఈజీగా పనైపోతుంది అనుకున్నారు. ఒక రూ.500 నకిలీ నోటును చెలామణీ చెయ్యగలిగితే.. రెండు రోజులు హాయిగా జీవించవచ్చు అనుకున్నారు. ఇలా ఎన్ని నోట్లు చెలామణీ చేస్తే, అంతలా లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు అనుకున్నారు. అందుకోసం.. నకిలీ నోట్లను ఎవరైనా ఇస్తారేమో అని చూశారు. అలా ఇచ్చే వారు ఎవరూ దొరకలేదు. దాంతో.. తామే ముద్రిస్తే సరిపోతుంది అని అనుకున్నారు. అంతా ప్లాన్ రెడీ చేశారు.
ఈ ఇద్దరూ కలిసి.. అనంతపురం సిటీలో.. అత్యాధునిక ప్రింటర్లు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లను రెడీ చేసుకున్నారు. ఈమధ్య కొత్త రకం ప్రింటర్లు వచ్చాయి. అవి.. దేన్నైనా అచ్చు గుద్దినట్లు ప్రింట్ చేస్తున్నాయి. అందువల్ల వీళ్లు.. ఆ ఖరీదైన ప్రింటర్ కొన్నారు. ల్యాప్ టాప్ ద్వారా ప్రింట్ ఇవ్వగానే.. నకిలీ నోటు.. కలర్ ప్రింట్ వస్తోంది. రెండువైపులా ప్రింట్ తీసి.. జాగ్రత్తగా కట్ చేసి.. ఒరిజినల్ రూ.500 నోటులా తయారుచేస్తున్నారు. ఆ తర్వాత ఆ నోటును తీసుకెళ్లి.. చికెన్ షాపుల్లో, కూరగాయల షాపుల్లో, ఫ్యాన్సీ దుకాణాల్లో చెలామణీ చేస్తున్నారు. టిప్‌టాప్‌గా కనిపిస్తూ.. తమపై ఏమాత్రం అనుమానం రాకుండా చూసుకుంటున్నారు.
ఇలా కొన్నాళ్లు గడిచాక.. మాటిమాటికీ షాపులకు వెళ్లి నోట్లు మార్చడం కష్టం అనుకున్నారు. అందువల్ల తమ ప్లాన్‌ను మరింత విస్తరించాలి అని అనుకున్నారు. అందులో భాగంగా.. కొంతమంది కుర్రాళ్లకు.. నకిలీ నోట్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. తద్వారా.. ప్రతీ నోటుకూ కొంత మనీ తీసుకుంటున్నారు. ఆ కుర్రాళ్లు గ్యాంగులా ఏర్పడి.. ఆ నోట్లను వేర్వేరు నగరాలు, ప్రాంతాల్లో చెలామణీ చేస్తున్నారు. ఇలా ఈ నకిలీ నోట్ల దందా.. మరింత విస్తరించింది. ఇది చివరకు విజయవాడ పోలీసుల దాకా వెళ్లింది. దాంతో వాళ్లు రంగంలోకి దిగారు. గ్యాంగులో ఒకణ్ని పట్టుకొని.. కూపీ లాగితే.. అనంతపురంలో అసలు డొంక ఉన్నట్లు తెలిసింది. జాగ్రత్తగా వెళ్లి.. నోట్లు ముద్రిస్తూ ఉండగా.. ఆ ఇద్దర్నీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇప్పుడు వాళ్లను విజయవాడకు తరలించారు. అక్కడ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించి.. ఈ మొత్తం దందా ఎలా జరుగుతోందో తెలుసుకొని.. దీనికి పూర్తిగా చెక్ పెట్టబోతున్నారు.
ఇలా మన దేశంలో నకిలీ నోట్ల స్కామ్స్ బాగా జరుగుతున్నాయి. కాబట్టి.. మనం నోట్లను తీసుకునేటప్పుడు అది మంచిదా కాదా అనేది చూసుకోవాలి. అందులో వైట్ స్పేస్‌లో గాంధీజీ వాటర్ మార్క్ బొమ్మ కనిపిస్తోందా? అనేది చెక్ చేసుకోవాలి. అలాగే.. మెరిసే స్ట్రిప్ కూడా నిజమైనదేనా అనేది చూడాలి. జాగ్రత్తగా ఉండకపోతే, మోసపోతాం. మీ దగ్గరకు నకిలీ నోటు వస్తే.. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. దాన్ని మీకు ఎవరు ఇచ్చారో చెప్పాలి. తద్వారా.. పోలీసులు దర్యాప్తు చేస్తారు.
Hyderabad,Telangana

