Last Updated:
చిత్తూరు జిల్లాలో వృద్ధ దంపతుల దారుణ హత్య. కుప్పం నియోజకవర్గంలో ఘటన. ఆస్తి వివాదమే కారణమని అనుమానం. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చిత్తూరు జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన దారుణ జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న వృద్ధ దంపతులను గుర్తుతెలియని దుండగులు మార్గమధ్యంలో అడ్డగించి కత్తులతో అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేయగా, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. హత్యల వెనుక ఆస్తి వివాదమే కారణమై ఉండొచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తుండగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రామకుప్పం మండలంలోని బందార్లపల్లె గ్రామానికి చెందిన వెంకటేశు (65), ఆయన భార్య పార్వతమ్మ (62) ప్రతి రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి కూడా ద్విచక్రవాహనంపై రామకుప్పంలోని తమ ఇంటికి బయలుదేరారు. వెంకటేశు బోరు మోటార్ మెకానిక్‌గా పని చేస్తూ పగటిపూట షాపులో ఉండి, రాత్రి భార్యతో కలిసి రామకుప్పంలోని ఇంటికి వెళ్లడం ఆయన దినచర్య. అయితే రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో శాంతినికేతన్ పాఠశాల సమీపానికి చేరుకోగానే గుర్తుతెలియని వ్యక్తులు వారి బైక్‌ను అడ్డగించారు.
దుండగులు ముందుగా వెంకటేశుపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి ముఖం, గొంతు భాగాల్లో తీవ్రంగా నరికినట్లు పోలీసులు తెలిపారు. భర్తపై దాడి జరుగుతుండటాన్ని చూసి పార్వతమ్మ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగెత్తేందుకు ప్రయత్నించగా, దుండగులు ఆమెను వెంబడించి కొద్ది దూరంలోనే పట్టుకుని గొంతుపై కత్తితో దాడి చేసి హతమార్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ దారుణంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, రామకుప్పం ఎస్ఐ వెంకటమోహన్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్య జరిగిన తీరును బట్టి ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడిగా పోలీసులు భావిస్తున్నారు. కిరాయి హంతకుల ప్రమేయం ఉండొచ్చనే అనుమానంతో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించి స్థానికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఒక్కరే ఈ హత్యలకు పాల్పడ్డారని చెబుతుండగా, మరికొందరు నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి ఆటోలో వచ్చి దాడి చేసి అదే వాహనంలో పరారైనట్లు చెబుతున్నారు. ఈ వాదనల నిజానిజాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇటీవల మృతుడు వెంకటేశుకు దాయాదులతో భూవివాదం నెలకొనగా, పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి రాజీ కుదిరినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భూవివాదమే హత్యలకు కారణమా? లేక మరేదైనా వ్యక్తిగత కక్షలున్నాయా? అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సంఘటన స్థలానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్యలకు కారణమైన వారిని త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.
Chittoor,Chittoor,Andhra Pradesh
Jul 18, 2026 12:33 PM IST
