Last Updated:
Cyber Fraud: ఆధునిక సాంకేతికత విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త రూపాల్లో అమాయకులను నిలువునా దోచుకుంటున్నారు.
వాట్సప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను అడ్డాగా చేసుకుని నయా మోసాలకు తెరతీస్తున్నారు. కొద్ది రోజుల్లోనే భారీ లాభాలు, రెట్టింపు రాబడులు వస్తాయంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి అమాయకులను వలలో వేసుకుంటున్నారు. తొలుత కొద్ది మొత్తంలో లాభాలు జమచేసి నమ్మకం కుదిర్చాక, ఆపై లక్షల రూపాయలు గుంజి చేతులెత్తేస్తున్నారు. తాజా ఘటనల్లో ఓ విద్యార్థిని సహా ఇద్దరు వ్యక్తులు సైబర్ కేటుగాళ్ల మాయమాటలు నమ్మి ఏకంగా రూ.47 లక్షలకు పైగా పోగొట్టుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
విజయవాడకు చెందిన ఓ బి.ఫార్మసీ విద్యార్థినికి స్నాప్‌చాట్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. బిట్‌కాయిన్‌లో కొద్దిపాటి పెట్టుబడి పెడితే అనూహ్యమైన లాభాలు గడించవచ్చంటూ ఆమెకు నిరంతరం సందేశాలు పంపాడు. తొలుత ఆమె తిరస్కరించినప్పటికీ, పదే పదే నమ్మించే ప్రయత్నం చేయడంతో ఆ మాటలను నిజమని నమ్మింది. ముందుగా తన తల్లి ఫోన్‌పే ఖాతా నుంచి రూ.5 వేలు, అనంతరం తన ఖాతా నుంచి రూ.15 వేలను ఆ వ్యక్తి సూచించిన ఖాతాకు బదిలీ చేసింది. ఆ తర్వాత ఆమెకు ఒక గుర్తుతెలియని ఫోన్ కాల్ వచ్చింది. ఎదుటి వ్యక్తి తాను ఒక బ్యాంకు బ్రాంచ్ మేనేజర్‌నని పరిచయం చేసుకున్నాడు. ఆమె పెట్టిన పెట్టుబడికి పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయని, వాటిని వెనక్కి తీసుకోవాలంటే ముందుగా పన్నులు చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికాడు. డబ్బు చెల్లించకపోతే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగాడు. భయాందోళనకు గురైన ఆ విద్యార్థిని విడతలవారీగా ఏకంగా రూ.28.75 లక్షలను ఆన్లైన్ ద్వారా సైబర్ మోసగాళ్లకు చెల్లించింది. అంతటితో ఆగకుండా డీడీ చార్జీల పేరిట మరో రూ.70 వేలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.
మరో ఘటనలో నగరంలోని పంజా సెంటర్‌కు చెందిన వ్యక్తి ఫేస్బుక్లో పద్మావతి అనే ప్రొఫైల్‌తో పరిచయం పెంచుకున్నాడు. షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో భారీ ఆదాయం సంపాదించవచ్చని ఆమె ఆశ చూపింది. అనంతరం బాధితుడికి వాట్సప్ కాల్ రాగా, అందులో మాట్లాడిన వ్యక్తి తాను ‘బార్కెల్స్ సెక్యూరిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు చెందిన అధీకృత ఏజెంట్ గోవర్ధన్ శర్మగా పరిచయం చేసుకున్నాడు. అతడు పంపిన లింక్ ద్వారా బాధితుడు ఆధార్, పాన్ కార్డు వివరాలు నమోదు చేసి ట్రేడింగ్ ఖాతా తెరిచాడు. తమ ప్లాట్‌ఫారమ్ ద్వారా కొన్ని నిర్దిష్ట కంపెనీల షేర్లు కొంటే అత్యధిక రాబడి వస్తుందని నమ్మించాడు. ఆ మాటలు గుడ్డిగా నమ్మిన బాధితుడు రూ.18.63 లక్షలు పెట్టి షేర్లు కొనుగోలు చేశాడు. ఆ ఖాతాలో ఏకంగా రూ.32 లక్షల మొత్తం కనిపిస్తుండటంతో సంతోషపడి ఆ సొమ్మును డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ నగదును విత్‌డ్రా చేయడం సాధ్యపడలేదు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం మరో రూ.3.84 లక్షలు చెల్లిస్తేనే అసలు, లాభాల సొమ్ము విత్‌డ్రా అవుతుందని కంపెనీ పేరిట నకిలీ ఈమెయిల్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనుమానాస్పద ప్రకటనలు, లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచిత వ్యక్తులు ఇచ్చే ఆర్థిక సలహాలు, తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడులు వస్తాయనే ఆశల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా సైబర్ మోసాల బారిన పడితే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

