తక్కువ పెట్టుబడి, కొద్దిపాటి స్థలం ఉంటే చాలు.. పుట్టగొడుగుల సాగుతో మంచి ఆదాయం సంపాదించవచ్చు. నెలకు రూ.35 వేల నుంచి రోజుకు టన్ను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగిన పలువురి విజయగాథలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. వీరి సక్సెస్ స్టోరీని పీఐబీ వివరించింది. అసలు పుట్టగొడుగుల సాగు ఎలా చేయాలి? ఇందులో ఆదాయ అవకాశాలు ఏంటి? తెలుసుకుందాం. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ ప్రజలు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పుట్టగొడుగులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పుట్టగొడుగుల సాగు భారత్లో మంచి ఉపాధి మార్గంగా ఎదుగుతోంది. ముఖ్యంగా రైతులు, మహిళలు, గ్రామీణ యువతకు తక్కువ పెట్టుబడితో ఆదాయం సంపాదించే అవకాశం కల్పిస్తోంది. పుట్టగొడుగుల్లో కేలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్, డైటరీ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మాత్రం సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు, వీటి సాగుకు ఎక్కువ భూమి అవసరం లేదు. గ్రామాల్లోనే కాకుండా పట్టణాలు, పట్టణాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వీటిని పండించవచ్చు. వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి పుట్టగొడుగులను పండించే అవకాశం ఉండటంతో తక్కువ స్థలం, నీరు, పెట్టుబడితోనే ఈ సాగును ప్రారంభించవచ్చు. అందుకే సంప్రదాయ వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ఇది మంచి ఆదాయ మార్గంగా మారుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)

