వీరిద్దరి పరిచయం 2011లో జరిగింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘తీన్ మార్’. ఈ సినిమాలో అన్నా లెజినోవా ఓ చిన్న రోల్లో కనిపించారు. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్ షిప్ కాస్త ప్రేమగా మారింది.
అయితే వీరిద్దరి ప్రేమ ఎలా మొదలైంది? మొదట ఎవరు ప్రపోజ్ చేశారు? వంటి విషయాలను పవన్ కళ్యాణ్ కానీ, అన్నా లెజినోవా కానీ ఎప్పుడూ బహిరంగంగా వెల్లడించలేదు. అందుకే వీరి ప్రేమకథకు సంబంధించిన చాలా విషయాలు ఇప్పటికీ వ్యక్తిగతంగానే ఉండిపోయాయి. కానీ 2011లో మొదలైన పరిచయం రెండేళ్లలోనే పెళ్లి వరకు వెళ్లడం మాత్రం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా అప్పటికే పవన్ కళ్యాణ్‌కు రెండు పెళ్లిళ్లు జరిగి ఉండటంతో మూడో పెళ్లి విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవాల పెళ్లి గురించి అప్పట్లో పెద్దగా ప్రచారం జరగలేదు. సాధారణంగా ఒక స్టార్ హీరో పెళ్లి అంటే ఫ్యాన్స్, మీడియా హడావిడి, సినీ సెలబ్రిటీలతో భారీ హడావుడి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన మూడో పెళ్లి చాలా సింపుల్‌గా చేసుకున్నాడు. 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో వీరిద్దరి వివాహం జరిగింది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో Special Marriage Act, 1954) ప్రకారం వీరి పెళ్లి నమోదైంది. పెళ్లి చేసుకునే టైమ్‌కు వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 9 ఏళ్లు.
పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా ఆగస్టు 30, 2013న పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించినట్లు… అక్కడ పెళ్లికి సంబంధించిన దరఖాస్తును సమర్పించారట. స్పెషల్ మ్యారేజ్ ఆక్ట్ ప్రకారం నెల రోజుల నోటీసు ప్రక్రియను పూర్తి చేశారు. ఈ టైమ్ అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు వాళ్ల పాస్‌పోర్ట్ ఫొటోలను నోటీసు బోర్డుపై ఉంచారు. నెల రోజుల వ్యవధిలో ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో సెప్టెంబర్ 30న వివాహాన్ని అధికారికంగా జరిపించారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వీరిద్దరూ తమ పెళ్లి కోసం చెల్లించిన ఫీజు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనట. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా ఒకరికొకరు పూలమాలలు మార్చుకున్నారు. ముగ్గురు సాక్షుల సమక్షంలో వివాహ ప్రమాణం చేశారు.
పవన్ కళ్యాణ్ మొదటిసారి 1997లో నందిని అనే మహిళను వివాహం చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహం ఇది. అయితే వీరిద్దరి మధ్య కొంతకాలానికే విభేదాలు ఏర్పడ్డాయి. రెండేళ్లకే విడిగా ఉండటం మొదలుపెట్టినట్లు అప్పటి కథనాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత న్యాయపరమైన వివాహ బంధం 2008లో ముగిసింది.అనంతరం పవన్ కళ్యాణ్ తనతో కలిసి సినిమాల్లో నటించిన రేణు దేశాయ్‌తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ ‘బద్రి’, ‘జానీ’ సినిమాల టైమ్‌లో దగ్గరయ్యారు. కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత 2009లో వివాహం చేసుకున్నారు.
వీరికి అకిరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈ బంధం కూడా ఎక్కువకాలం కొనసాగలేదు. 2012లో వీరిద్దరూ విడిపోయారు. ఇలా రెండు పెళ్లిళ్లు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ జీవితంలోకి అన్నా లెజినోవా వచ్చారు. 2011లో ‘తీన్ మార్’ సినిమా షూటింగ్ సమయంలో పరిచయమైన వీరిద్దరూ 2013లో వివాహం చేసుకున్నారు.
2023లో బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన మూడు వివాహాల గురించి కూడా మాట్లాడారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నారనే విమర్శలపై స్పందిస్తూ.. తాను ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకోలేదని, ఒకరితో బంధం కొనసాగకపోవడంతో మరో వివాహం చేసుకోవాల్సి వచ్చిందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ విమర్శలకు ఉపయోగించుకుంటున్నారని కూడా ఆయన ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా వివాహం తర్వాత వీరి కుటుంబంలోకి ఇద్దరు పిల్లలు వచ్చారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె పేరు పొలెనా అంజనా పవనోవా (Polena Anjana Pawanova). కుమారుడి పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ (Mark Shankar Pawanovich).
అన్నా లెజినోవా వ్యక్తిగత జీవితం గురించి మరో విషయం కూడా అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఆమెకు పవన్ కళ్యాణ్‌తో వివాహానికి ముందే ఒక కుమార్తె ఉన్నట్లు ఎన్డీటీవీ కథనం పేర్కొంది. అయితే ఆమె కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను మాత్రం పెద్దగా బయటపెట్టలేదు. పవన్ కళ్యాణ్ కూడా తన కుటుంబాన్ని మీడియాకు సాధ్యమైనంత దూరంగా ఉంచేవారు.
పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో అన్నా ఆయనకు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా 2024 ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుతమైన విజయం సాధించిన తర్వాత పవన్ ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో అన్నా సంప్రదాయ పద్ధతిలో హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
అలాగే పవన్ కళ్యాణ్ కుటుంబంతో కలిసి అన్నా కనిపించిన ఫొటోలు కూడా అభిమానులకు ఆనందాన్ని కలిగించాయి. పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవాల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఈరోజు కొత్తగా మొదలైంది కాదు. గతంలో కూడా పలుమార్లు వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు వచ్చాయి.
ముఖ్యంగా 2023లో అన్నా లెజినోవా కొన్ని ఫ్యామిలీ వేడుకలకు హాజరు కాకపోవడంతో వీరి మధ్య మనస్పర్థలు ఉన్నాయనే ప్రచారం మొదలైంది. కొన్ని కార్యక్రమాల్లో పవన్ ఒంటరిగా కనిపించడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి కనిపించడంతో విడాకుల వార్తలకు బ్రేక్ పడింది. 2024లో పవన్ రాజకీయ విజయాన్ని అన్నా సెలబ్రేట్ చేసుకున్న తీరు కూడా అప్పటి ఊహాగానాలకు సమాధానంగా నిలిచింది.
అంతేకాదు.. అన్నా సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఆమెతో కలిసి కనిపించారు. ఆమె గ్రాడ్యుయేషన్ వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇలా గతంలో ఎన్నోసార్లు వీరి బంధంపై పుకార్లు వచ్చినప్పటికీ.. వాటిని నిజమని నిర్ధారించే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఇక ఇప్పుడు 2026 నవంబర్ 9న రాత్రి 11 గంటల సమయంలో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా తమ వైవాహిక బంధాన్ని ముగించుకుంటున్నట్లు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన జనసేన పార్టీ మీడియా గ్రూప్ ద్వారా బయటకు వచ్చింది. ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయమని, పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని అందులో పేర్కొన్నారు.
అంతేకాదు.. తమ వివాహ బంధం ముగిసినప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని, పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా ఉంటామని స్పష్టం చేశారు. పిల్లల సంతోషం, భవిష్యత్తు, శ్రేయస్సు తమకు ఎప్పటికీ ముఖ్యమని వెల్లడించారు. ఈ వ్యక్తిగత మార్పు సమయంలో తమ గోప్యతను గౌరవించాలని అభిమానులు, శ్రేయోభిలాషులను కోరారు. తమ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ఈ ప్రకటనలో విడిపోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఎవరి వల్ల విభేదాలు వచ్చాయి? ఎప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగింది? వంటి విషయాలపై ఎలాంటి వివరాలు బయటపెట్టలేదు.
పవన్ కళ్యాణ్ ఒకవైపు స్టార్ హీరోగా, మరోవైపు జనసేన పార్టీ అధినేతగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చినా అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అందులోనూ పవన్ కళ్యాణ్‌కు ఇది మూడో వివాహం కావడం, అన్నా లెజినోవాతో 13 ఏళ్ల పాటు వైవాహిక జీవితాన్ని కొనసాగించడం, ఇద్దరు పిల్లలు ఉండటం ఈ వార్తకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి.
ముఖ్యంగా గతంలో కూడా వీరిద్దరి విడాకుల గురించి ప్రచారం జరిగినప్పుడు అభిమానులు ఆందోళన చెందారు. కానీ ప్రతిసారి కలిసి కనిపించడంతో ఆ వార్తలు కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు మాత్రం స్వయంగా ఇద్దరూ ఉమ్మడి ప్రకటన విడుదల చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
సినిమా షూటింగ్లో మొదలైన పరిచయం.. రెండేళ్ల ప్రేమాయణం.. ఆ తర్వాత పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. ఇలా సాగిన పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవాల 13 ఏళ్ల ప్రయాణం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం వారి నుంచే రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇద్దరూ తమ పిల్లల భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం గమనార్హం.
