Last Updated:
కెనడాలోని సర్రే నగరంలో వాల్‌మార్ట్ పార్కింగ్ వద్ద జరిగిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన యువకుడు, అతని ప్రియురాలు ప్రాణాలు కోల్పోయారు. వ్యవస్థీకృత నేర ముఠాల ప్రమేయంతో పక్కా పథకం ప్రకారమే ఈ హత్యలు జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ సర్రే నగరంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక వాల్‌మార్ట్ స్టోర్ పార్కింగ్ ప్రదేశంలో జరిగిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన ఇద్దరు యువతీయువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను పొరుగున ఉన్న డెల్టా ప్రాంతానికి చెందిన గగన్‌ప్రీత్ అలియాస్ గ్యారీ రెహాల్ (23), అతని ప్రియురాలు సుఖ్జీత్ కౌర్ (24)గా ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (IHIT) గుర్తించింది. నవంబర్ 15 రాత్రి సుమారు 10:38 గంటలకు 88 అవెన్యూ, 124 స్ట్రీట్ సమీపంలోని వాల్‌మార్ట్ పార్కింగ్ వద్ద ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న సర్రే పోలీసులు, వైద్య సిబ్బంది గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే వారు మరణించారు. ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన టార్గెటెడ్ దాడి అని, వెనుక వ్యవస్థీకృత నేర ముఠాల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రెహాల్పై గతంలో ఆయుధాల చట్టం కింద కేసులు ఉన్నాయని, కౌర్‌కు కెనడాలో పరిమిత పరిచయాలే ఉన్నాయని అధికారులు తెలిపారు.
న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. కాల్పులు జరిగిన సుమారు 15 నిమిషాలకే రాత్రి 10:51 గంటలకు సమీపంలోని ప్రిన్సెస్ డ్రైవ్ 9700 బ్లాక్ వద్ద ఒక కారు మంటల్లో కాలిపోయినట్లు అధికారులకు సమాచారం అందింది. కాలిపోయిన ఆ నాలుగు డోర్ల సెడాన్ కారును నిందితులే వాడి ఉంటారని ఐహెచ్ఐటీ సార్జెంట్ ఫ్రీడా ఫాంగ్ తెలిపారు. వాల్‌మార్ట్ పార్కింగ్ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు, నవంబర్ 15 రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య ఆ మార్గంలో ప్రయాణించిన వారు తమ వద్ద ఉన్న డ్యాష్‌క్యామ్ ఫుటేజ్ అందించాలని కోరారు.
ఈ ఘటనపై గగన్‌ప్రీత్ తండ్రి స్థానిక రెడ్ ఎఫ్ఎం కెనడాతో మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యారు. కాల్పులకు కొద్ది నిమిషాల ముందే తన కుమారుడు ఇంటి నుంచి వెళ్లాడని, సుఖ్జీత్ అతని ప్రియురాలేనని ధృవీకరించారు. ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తాను కాల్గరీ నుంచి తిరిగి వస్తుండగా ఈ వార్త తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డ మృతదేహాన్ని ఎక్కడికి తరలించారో పోలీసులు చెప్పడం లేదని, కనీసం చివరిసారిగా తన కొడుకును చూడాలనుకుంటున్నానని ఆయన విలపించారు.
మృతులిద్దరూ పంజాబీ కమ్యూనిటీకి చెందిన వారని ప్రత్యక్ష సాక్షులు చెబుతుండగా, పోలీసులు మాత్రం వారిని డెల్టా ప్రాంత దక్షిణాసియా నివాసులుగా పేర్కొన్నారు. చిన్న వయసులోనే రెండు నిండు ప్రాణాలు పోవడం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చిందని సార్జెంట్ ఫ్రీడా ఫాంగ్ విచారం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. హత్యలు, కారు దహనం కేసులను సర్రే పోలీసులు, ఐహెచ్ఐటీ బృందాలు సంయుక్తంగా దర్యాప్తు చేస్తూ నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.

