Last Updated:
అవసరం లేకుంటే బంగారం కొనొద్దన్న తన పిలుపునకు దేశ ప్రజలు స్పందించడం వల్లే పసిడి ధరలు తగ్గాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం లక్నోలో అన్నారు. దీనివల్ల ప్రజల డబ్బు ఆదా అయిందని పేర్కొన్నారు.
అవసరం లేకుంటే బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని తాను చేసిన విజ్ఞప్తికి దేశ ప్రజలు సానుకూలంగా స్పందించడం వల్లే పసిడి ధరలు తగ్గాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని గోమతి నగర్ ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్ వేదికగా శనివారం జరిగిన 5వ జాతీయ నైపుణ్య స్నాతకోత్సవం (కౌశల్ దీక్షాంత్ సమారోహ్)లో ఆయన ప్రసంగించారు. 1965లో ఆహార కొరత ఏర్పడినప్పుడు ఒకపూట భోజనం మానేయాలని నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన పిలుపును దేశం మొత్తం శిరసావహించిందని మోదీ గుర్తుచేశారు.
నేటికీ భారతీయుల్లో అదే గొప్ప సంస్కారం, దేశభక్తి సజీవంగా ఉన్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఏడాది పాటు అనవసరంగా బంగారం కొనొద్దని తాను కోరగానే దేశవాసులు కొనుగోళ్లు తగ్గించారని, ఫలితంగా పసిడి ధరలు దిగొచ్చాయని ప్రధాని పేర్కొన్నారు. తన మాట విని ఎంతో మంది తమ డబ్బును ఆదా చేసుకున్నారని, ప్రజలే స్వయంగా ఈ విషయాన్ని తనతో చెబుతున్నారని మోదీ వివరించారు.
PM Modi also asked Indians to stop buying gold a year ago.
Today, gold prices have crashed, saving crores of rupees for Indian households! https://t.co/tQYg2BfTHM— Political Kida (@PoliticalKida) November 21, 2026
“నాలాంటి సామాన్య వ్యక్తి బంగారం తక్కువగా కొనమని కోరాడు. దేశ ప్రజలు తక్కువగా కొన్నారు. దాంతో బంగారం ధరలు పడిపోయాయి. ఈరోజు ప్రజలు నా దగ్గరకు వచ్చి.. ‘మోదీజీ, మీరు చెప్పారు, మేము మీ సలహా విన్నాం, మా డబ్బు ఆదా అయింది’ అని చెబుతున్నారు” అంటూ ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఏడాది క్రితం తాను ఈ విజ్ఞప్తి చేశానని ప్రధాని ప్రసంగంలో పేర్కొన్నప్పటికీ, వాస్తవానికి ఈ ఏడాది మే 10న తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జరిగిన సభలో ఆయన ఈ పిలుపునిచ్చారు. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగి విదేశీ మారకద్రవ్యంపై ఒత్తిడి పడిన నేపథ్యంలో, ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించాలని అప్పట్లో మోదీ ప్రజలను కోరారు.
గత మే నెలలో ప్రధాని ఈ పిలుపునిచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ వంటి కారణాలతో పాటు దేశీయంగా డిమాండ్ తగ్గడం ధరలపై ప్రభావం చూపింది. మే నెల ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.51 లక్షల స్థాయికి చేరగా, నవంబర్ నాటికి అది దాదాపు రూ.10 వేల మేర తగ్గి రూ.1.41 లక్షల సమీపానికి చేరింది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకున్న సామాన్య కుటుంబాలకు భారీగా ఆర్థిక భారం తప్పిందని విశ్లేషకులు చెబుతున్నారు.

