మెదక్ ప్రాంతంలోని ఓ గ్రామంలో పర్వతాలు (వీకే నరేష్) కుటుంబ గౌరవానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటాడు. అయితే పెద్దల్లుడు బాలరాజు (తరుణ్ భాస్కర్) తాగుడుకు బానిసై చేసే పనులతో ఆయన తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఈ పరిస్థితుల్లో చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్)కు పెళ్లి చేయాలని తండ్రి భావిస్తాడు. కానీ కీర్తి మాత్రం ఉద్యోగం సంపాదించి తన కాళ్లపై తాను నిలబడాలని కోరుకుంటుంది. మరోవైపు ఉదయ్ (అఖిల్ రాజ్)ను ప్రేమించిన ఆమెకు ఇంట్లో వాళ్ల మాటను కాదనలేని పరిస్థితి. ఇంతలో తండ్రి ఓ ఎన్నారై సంబంధాన్ని తీసుకురావడంతో కీర్తి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? తన ఆశయాన్ని, ప్రేమను నిలబెట్టుకునేందుకు ఆమె ఏం చేసింది? అనేదే సినిమా కథ.
ఆడపిల్లలకు ఆస్తిపాస్తులతో పాటు ఆర్థిక స్వతంత్రం, మంచి చదువు కూడా ఎంత ముఖ్యమో చెప్పాలనే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. పెళ్లి కోసం భారీగా ఖర్చు చేయడం కంటే కూతురి భవిష్యత్తు కోసం ఆ మొత్తాన్ని వినియోగిస్తే ఆమె జీవితానికి ఉపయోగపడుతుందనే పాయింట్ బాగుంది. అయితే ఈ విషయాన్ని ఆసక్తికరమైన కథగా మలచడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు కాలేదు. ఫస్టాఫ్‌లో నరేష్, తరుణ్ భాస్కర్ మధ్య వచ్చే సన్నివేశాలు కొంత వినోదాన్ని అందిస్తాయి. కీర్తి ప్రేమకథ, ఎన్నారై సంబంధం చుట్టూ నడిచే సన్నివేశాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపవు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు బోర్ కొట్టించింది.
సెకండాఫ్‌లోనూ భావోద్వేగాలు బలంగా పండలేదు. తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సెంటిమెంట్, ప్రీ క్లైమాక్స్‌లోని కొన్ని సన్నివేశాలు తప్ప సెకండ్ హాఫ్‌లో చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదు. అనుపమ, నరేష్ తమ నటనతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. తరుణ్ భాస్కర్ కూడా తన పాత్రలో మెప్పించారు. సురేష్ బొబ్బిలి సంగీతం, గ్రామీణ వాతావరణాన్ని చూపించిన కెమెరా పనితనం పర్వాలేదనిపిస్తాయి. మొత్తంగా మంచి సందేశం ఉన్నప్పటికీ, దాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో సినిమా తడబడింది.
ప్లస్ పాయింట్స్:
అనుపమ పరమేశ్వరన్, వీకే నరేష్ నటన,
తరుణ్ భాస్కర్ కామెడీ,
మైనస్ పాయింట్స్:
కొత్తదనం లేని ప్రేమకథ,
ఆసక్తి తగ్గించే కథనం,
బలంగా పండని భావోద్వేగ సన్నివేశాలు,
ఆకట్టుకోని స్క్రీన్‌ప్లే.
ఫైనల్‌గా:
‘క్రేజీ కళ్యాణం’లో చెప్పాలనుకున్న విషయం బాగుంది. కానీ దాన్ని హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించడంలో లోపాలు కనిపిస్తాయి. అనుపమ, నరేష్ నటన కోసం చూడాలనుకునేవారు ప్రయత్నించవచ్చు. కానీ థియేటర్‌కు వెళ్లి చూసేంత స్టఫ్ మాత్రం లేదు అని పర్సనల్‌గా నాకు అనిపించింది.
రేటింగ్: 2.5
