Last Updated:
భారత కార్ల మార్కెట్‌లో కీలక మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఆధిపత్యం చెలాయించిన పెట్రోల్ కార్లను వెనక్కి నెట్టి CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. ఆగస్టు నెలలో మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో ప్రత్యామ్నాయ ఇంధన మోడళ్ల వాటా దాదాపు 42 శాతానికి చేరగా.. పెట్రోల్ వాహనాల వాటా 41 శాతానికి తగ్గింది. ఇంధన ఖర్చులు, మైలేజ్‌తో పాటు E20 పెట్రోల్‌పై ఉన్న గందరగోళం కూడా ఈ మార్పుకు కారణాలుగా కనిపిస్తున్నాయి.
భారతదేశ ఆటోమొబైల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ఆసక్తికరమైన, చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. దేశీయ రోడ్లపై ఎప్పుడూ రారాజులా వెలుగొందే పెట్రోల్ కార్ల ఆధిపత్యానికి బ్రేక్ పడింది. ఆగస్టు నెలలో నమోదైన ప్యాసింజర్ వాహనాల (కార్ల) విక్రయాలను పరిశీలిస్తే.. సాంప్రదాయ పెట్రోల్‌తో నడిచే కార్ల కంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG), హైబ్రిడ్, ఎలక్ట్రిక్ మోడల్ (EV) వాహనాలే అత్యధికంగా అమ్ముడయ్యాయి. ఈ కీలకమైన గణాంకాలను దేశంలోని ప్రముఖ కార్లు, ద్విచక్ర వాహన తయారీదారుల డీలర్లకు ప్రాతినిధ్యం వహించే సంస్థ ‘ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA)’ సోమవారం అధికారికంగా వెల్లడించింది.

