Last Updated:
తెలంగాణ రాష్ట్రంలో 2028లో డబుల్ ఇంజన్ సర్కారును ఏర్పాటు చేస్తామని తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశను ఇవ్వాలన్నదే బీజేపీ సంకల్పమని జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 2028లో డబుల్ ఇంజన్ సర్కారును ఏర్పాటు చేస్తామని తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశను ఇవ్వాలన్నదే బీజేపీ సంకల్పమని జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. నితిన్ నబిన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా వరంగల్ లో పర్యటించారు. ముందుగా నితిన్ నవీన్ బీజేపీ నేతలతో కలిసి వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆ తర్వాత హరిత కాకతీయ హోటల్ లో గిరిజన నేతలతో సమావేశమయ్యారు. అనంతరం సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనానికి హాజరై సభలో ప్రసంగించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో బీజేపీ రాజకీయ లాభ నష్టాలను చూడలేదని తెలంగాణ ప్రజలను ఆకాంక్షను గౌరవించిందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ప్రజలు కలలుగన్న ఆశయాలు ఆకాంక్షలు నేటికీ పూర్తిగా నెరవేరలేదని కుటుంబ పాలన అవినీతి రాజకీయాలు ఆ కలను దెబ్బతీశాయని ఆరోపించారు.ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు.హామీలిచ్చి మర్చిపోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని అలా మర్చిపోతే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవుతుందంటూ ఎద్దేవా చేశారు.ఓరుగల్లు కోటపై కాషాయం జెండా ఎగురవేద్దామని 2028 సమరానికి మున్సిపల్ ఎన్నికలు సెమీఫైనల్ లాంటివని చెప్పారు. ప్రతి బూతులో కమలం వికసించాలని అప్పుడే మన సంకల్పం సాకారం అవుతుందని పార్టీ శ్రేణులకు సూచించారు.
బూత్ అధ్యక్షుల కృషి వల్లే భారతీయ జనతా పార్టీ కమలం దేశవ్యాప్తంగా వికసిస్తుందని తెలిపారు. అంకితభావం కలిగిన కార్యకర్తలం మధ్య ఉండడం గర్వంగా భావిస్తున్నానని చెప్పారు.బూత్ అధ్యక్షులు, బూత్ స్థాయి కార్యకర్తలు శక్తితోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణ లక్ష్యాన్ని మనం తప్పకుండా సాధిస్తామని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దుడసంకల్పం వల్లే హైదరాబాద్ తెలంగాణ అఖండ భారత దేశంలో అంతర్భాగంగా నిలిచిందని చెప్పారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలిపారు.
తెలంగాణలో బీజేపీకి ఉన్న బంధం కేవలం రాజకీయ బంధం కాదని అది పోరాటాల బంధం అని ప్రజల విశ్వాసంతో ఏర్పడిన బంధం అన్నారు.1980లో పార్టీ స్థాపించిన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ గెల్చుకున్న రెండు లోక్ సభ స్థానాల్లో ఒకటిని తెలంగాణ ప్రజల ఇచ్చారని చెప్పారు.ఈ తెలంగాణకు భారతీయ జనతా పార్టీకి మధ్య ఉన్న చారిత్రాత్మక అనుబంధానికి నిదర్శనమని గుర్తు చేశారు.
ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు దేశంలో సామాన్య ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా కోట్లాది పేద కుటుంబాలకు ఉచిత బియ్యం అందిస్తూ ఆహార భద్రత కల్పిస్తున్నామని, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తూ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు.
అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఎప్పుడూ జనం గురించే ఆలోచిస్తుందని త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందన్నారు. రాష్ట్రంలో వచ్చేసారి డబల్ ఇంజన్ సర్కార్ ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Hyderabad,Telangana
