Last Updated:
తెలంగాణ ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక శాఖల్లో కొత్త నియామకాలు చేపట్టింది. సీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్. శ్రీధర్ నియామకం, అజిత్ రెడ్డికి ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బాధ్యతలు, అలాగే అటవీ శాఖలో వినయ్ కుమార్‌కు HoFF అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చేపడుతూ 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివిధ శాఖల్లో కీలక బాధ్యతలను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం కొత్త పోస్టింగ్‌లు, అదనపు బాధ్యతలను కేటాయించింది.
చేనేత, హస్తకళల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌ను నియమించిన ప్రభుత్వం, ఆయనకు హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది. అటవీ శాఖ ప్రధాన కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ను నియమిస్తూ, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (EFS&T) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఆమెను బదిలీ చేసింది.
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (పొలిటికల్) ప్రధాన కార్యదర్శిగా అహ్మద్ నదీమ్‌ను నియమించింది. ఆయనకు మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు కూడా అదనంగా అప్పగించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక మార్పు చేస్తూ ఎన్. శ్రీధర్‌ను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జాకు బాధ్యతలు అప్పగించింది.
సీఎంఓలో పనిచేస్తున్న అజిత్ రెడ్డిని బదిలీ చేసి, ఇన్వెస్ట్ తెలంగాణ సంస్థ సీఈఓగా నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీగా పి. కాత్యాయనీ దేవిని నియమించడంతో పాటు హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. కె. గంగాధర్‌ను రోడ్లు, భవనాల (ఆర్&బీ) శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించగా, టి. వెంకన్నను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా నియమించింది.
కె. విద్యాసాగర్‌కు పర్యాటక శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. కె. చంద్రకళను జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమించింది. ఎం.డి. ముష్రఫ్ అలీ ఫరూక్‌ను టీజీఆర్‌ఈడీసీఓ (TGREDCO) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఎం. రఘునందన్ రావుకు మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగించడంతో పాటు ఆ శాఖకు అదనపు బాధ్యతలు కూడా కేటాయించింది.
ఇక అటవీ శాఖలో కూడా ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్ర హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (HoFF), ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (PCCF) డాక్టర్ సి. సువర్ణ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆమెను ప్రభుత్వ సేవల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
డాక్టర్ సి. సువర్ణ పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి వినయ్ కుమార్‌కు రాష్ట్ర హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (HoFF) పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్‌లైఫ్), చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌గా విధులు నిర్వహిస్తుండగా, తాజాగా రాష్ట్ర అటవీ దళాల అధిపతి బాధ్యతలను కూడా ప్రభుత్వం అప్పగించింది.
ఈ బదిలీలు, నియామకాల ద్వారా రాష్ట్ర పరిపాలనలో కీలక శాఖలకు కొత్త నాయకత్వాన్ని అందించడంతో పాటు పరిపాలనా సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Hyderabad,Telangana

