Last Updated:
ఉమ్మడి ఆదిలాబాద్‌లో మొహర్రం ఘనంగా, ప్రత్యేక సంప్రదాయాలతో జరిగింది, సవారీలు, గుండం ఆటలు, అస్సయి పాటలు ఆకట్టుకోగా హిందూ ముస్లిం కలిసి మతసామరస్యాన్ని చాటారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొహర్రం వేడుకలు ఈసారి కూడా అత్యంత వైభవంగా కొనసాగాయి. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా సవారీ బంగ్లాల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. డప్పుల మోతలు, అస్సయి పాటలు, గుండం ఆటలు, యువకుల కేరింతలతో ప్రతి ప్రాంతం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కుటుంబ సమేతంగా సవారీ బంగ్లాలకు చేరుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. రాత్రివేళ జరిగే ఊరేగింపులు, సంప్రదాయ కళారూపాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో మొహర్రం వేడుకలు ఒక విధంగా జరుపుకుంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ప్రత్యేక సంప్రదాయాలతో నిర్వహించడం విశేషం. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పీరీలుగా పిలిచే వాటిని ఇక్కడ సవార్లు అని పిలుస్తారు. అంతేకాదు, ఒక్కో గ్రామంలో ఒక్కో పేరుతో సవార్లను ఆరాధించడం ఈ ప్రాంత ప్రత్యేకతగా నిలిచింది. అందుకే ప్రతి గ్రామంలో మొహర్రం వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద సవారీ, ఇమామ్ కాశీం సవారీగా పిలిచే సవార్లు భక్తులను ఆకర్షిస్తుంటే, తాంసి మండల కేంద్రంలో కుర్లీ-బుడ్డన్ సవారీ, రాజేశ్వర్ సవారీ, కొమ్ముల సవారీలు ప్రత్యేకంగా నిలుస్తాయి. పొన్నారి గ్రామంలో మౌలాలి, పంజా, బచవలి పేర్లతో సవార్లను ఆరాధిస్తుండగా, భీంపూర్ మండలంలోని కరంజి (టి)లో హస్సేన్-హుస్సేన్ సవార్లు, నిపాని గ్రామంలో ఇమామ్ కాశీం పంజా సవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
మొహర్రం నెల ప్రారంభమైనప్పటి నుంచే చాలామంది భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి కాలికి చెప్పులు లేకుండా నియమాలను పాటిస్తున్నారు. సవారీ బంగ్లాల ముందు ఏర్పాటు చేసే గుండాల్లో మొహర్రం రెండో రోజు నుంచి దశమి వరకు నిరంతరం నిప్పులు మండుతుంటాయి. ఆ నిప్పు సెగల వద్ద డప్పులను వేడి చేసి వాయిస్తుండగా, వాటి లయకు అనుగుణంగా పిల్లలు, యువకులు, పెద్దలు వలయాకారంలో తిరుగుతూ గుండం ఆట ఆడడం ఈ వేడుకలలో అత్యంత ఆకర్షణీయమైన ఘట్టంగా నిలుస్తోంది. అస్సయి దూల హారతి పాటలు, సంప్రదాయ నృత్యాలు పండుగకు మరింత ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయి.
మొహర్రం వేడుకలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరో విశేషాన్ని కూడా చాటుతోంది. ఈ వేడుకలు కేవలం ఒక మతానికి పరిమితం కాకుండా అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చే మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. హిందూ, ముస్లిం ప్రజలు కలిసి సవార్లను దర్శించుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం, వేడుకల్లో పాల్గొనడం ఈ ప్రాంత సంస్కృతికి అద్దం పడుతోంది. సంప్రదాయం, భక్తి, సంస్కృతి, మతసామరస్యం కలగలిసి కనిపించే ఉమ్మడి ఆదిలాబాద్ మొహర్రం వేడుకలు ప్రతి ఏడాది వేలాది మందిని ఆకర్షించే ప్రత్యేక ఉత్సవంగా నిలుస్తున్నాయి.
Adilabad,Telangana
