Last Updated:
తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపతూన్ వద్ద నవంబర్ 28న కార్తీక దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రధాని మోదీ స్వాగతించారు. మరోవైపు తమిళనాడు సీఎం విజయ్ తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.
మధురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభం (దీపతూన్) వద్ద నవంబర్ 28న కార్తీక దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన కఠిన ఆదేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం స్వాగతించారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే ‘మురుగన్ స్వామికి జై’ (Glory To Lord Murugan) అంటూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. అంతకుముందు నవంబర్ 20 నాటి మధ్యంతర ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడంపై తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉచ్చిపిళ్లయార్ మండపం వద్ద వెలిగించిన జ్యోతితో శనివారం దీపతూన్ వద్ద దీపం వెలిగించాలని ఆదేశిస్తూ, అరుల్మిగు సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డును సస్పెండ్ చేసింది. ఆలయ నిర్వహణకు ఇద్దరు మాజీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్‌లను రిసీవర్లుగా నియమించి, కొండ భద్రతను సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించింది.
Vetrivel Muruganukku Arogara!
வெற்றிவேல் முருகனுக்கு அரோகரா!वेट्रिवेल मुरुगनुक्कु अरोगरा!
— Narendra Modi (@narendramodi) November 27, 2026
న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించిన ధర్మాసనం, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీ, దేవాదాయ శాఖ అధికారులు, మదురై జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా మొత్తం 15 మంది అధికారులకు, ఐదుగురు ట్రస్టీలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. సీఎస్, డీజీపీ తదుపరి విచారణ జరిగే డిసెంబర్ 15న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. సమీపంలోని దర్గాకు 50 మీటర్ల దూరం పాటిస్తూ భక్తులు దీపాలు వెలిగించుకోవచ్చని, దర్గా వద్ద కూడా సీఆర్‌పీఎఫ్ భద్రత కల్పించి ప్రార్థనలకు ఆటంకం కలగకుండా చూడాలని సూచించింది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తక్షణమే రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ డిమాండ్ చేశారు. టీవీకే ప్రభుత్వ నియంతృత్వ అహంకారానికి ఇది పెద్ద చెంపపెట్టు అని అభివర్ణించారు.
రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యం ఉందని, రాజకీయ పెద్దల ఆదేశాలతోనే అధికారులు పనిచేశారని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు విజయ్ ప్రభుత్వానికి మచ్చ తెచ్చాయని ఆయన విమర్శించారు. హిందూ వ్యతిరేక వైఖరికి తగిన గుణపాఠం జరిగిందని, ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత విజయ్‌కు లేదని నాగేంద్రన్ మండిపడ్డారు.

