Last Updated:
రోజూ దాహం తీర్చుకోవడానికి మనం నమ్మకంగా కొనుగోలు చేసే బాటిల్ వాటర్లోనే కలుషిత పదార్థాలు ఉంటే? ప్రముఖ వాటర్ బ్రాండ్‌కు సంబంధించిన నమూనాల్లో పరీక్షలు కొన్ని కీలక విషయాలను బయటపెట్టాయి. దీంతో FSSAI రంగంలోకి దిగి కీలక చర్యలు చేపట్టింది.
మనం నిత్యం తాగే బాటిల్ వాటర్ ఎంతవరకు సురక్షితం? ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లెరి ఉత్పత్తుల నాణ్యతపై తాజాగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని బిస్లెరి తయారీ కేంద్రం నుంచి సేకరించిన నీటి నమూనాలో హానికర బ్యాక్టీరియా ఉన్నట్లు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంబంధిత బ్యాచ్ విక్రయాలపై నిషేధం విధించడంతో పాటు కంపెనీపై చర్యలకు అనుమతి ఇచ్చింది. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ANI వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురి జిల్లా టెలిపారా గ్రామంలో ఉన్న బిస్లెరి తయారీ కేంద్రం నుంచి 2026 జూలైలో నీటి నమూనాలను సేకరించారు. వీటిని ప్రయోగశాలల్లో పరీక్షించగా కొలిఫార్మ్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ప్రాథమిక ప్రయోగశాలతో పాటు రిఫరల్ ల్యాబ్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించినట్లు సమాచారం. ఈ నమూనా బ్యాచ్ నంబర్ PB 201కు చెందినది. ఈ నీటిని 2026 జూలై 20న తయారు చేయగా, వినియోగానికి చివరి తేదీ 2027 జనవరి 19గా ఉంది. పరీక్షల ఫలితాల నేపథ్యంలో ఆగస్టు 12, 2026న ఈ బ్యాచ్ విక్రయాలను FSSAI నిలిపివేసింది. బిస్లెరి ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ప్రాసిక్యూషన్‌కు కూడా అనుమతి ఇచ్చింది.
ఇదిలా ఉండగా, నవంబర్ 22న కూడా బిస్లెరిపై FSSAI మరో చర్యను ప్రకటించింది. కంపెనీ ప్రాంగణం నుంచి సేకరించిన నీటి నమూనాలో తొలుత నిర్ణీత పరిమితులకు మించి బ్రోమేట్ ఉన్నట్లు గుర్తించారు. కంపెనీ ఈ ఫలితాలను సవాలు చేయడంతో మరో ప్రయోగశాలకు నమూనాను పంపారు. అక్కడ పరీక్షల్లో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు గుర్తించి, నీటిని సురక్షితం కాదని ప్రకటించారు. దీంతో ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 కింద కంపెనీపై చర్యలకు అనుమతి లభించింది.
అయితే తమ ఉత్పత్తులు వినియోగానికి సురక్షితమేనని బిస్లెరి చెబుతోంది. నియంత్రణ సంస్థకు సహకరిస్తామని తెలిపింది. ప్రయోగశాలల ఫలితాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, స్వతంత్ర పరీక్షల్లో బ్రోమేట్ పరిమాణం అనుమతించిన స్థాయిలోనే ఉందని పేర్కొంది. నవంబర్ కేసు గోవా కేంద్రంలో 2025 సెప్టెంబర్‌లో తయారైన ఒకే బ్యాచ్‌కు సంబంధించినదని స్పష్టం చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ తయారీ సంస్థలపై తనిఖీలను FSSAI విస్తరించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రత కమిషనర్లు, ప్రాంతీయ డైరెక్టర్లు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రమాద స్థాయిని బట్టి నమూనాలు సేకరించి పరీక్షించాలని, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చర్యలు తీసుకోవాలని సూచించింది.
తనిఖీలు, సేకరించిన నమూనాలు, ప్రయోగశాల నివేదికల వివరాలను FoSCoS వ్యవస్థలో నమోదు చేయాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్లపై పరీక్షలు కొనసాగుతున్నాయని FSSAI సీఈఓ రాజిత్ పున్హాని వెల్లడించారు. వినియోగదారుల్లో భయాందోళనలు సృష్టించడం ఈ పరీక్షల ఉద్దేశం కాదని, ఆహార భద్రత ప్రమాణాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు. మార్కెట్లో లభించే నీటి ఉత్పత్తులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారించడమే ఈ విస్తృత తనిఖీల ప్రధాన ఉద్దేశం.

