శంకుస్థాపనలకే పరిమితమైన అభివృద్ధి.. ఏడాది గడుస్తున్నా పూర్తికాని చర్ల బస్టాండ్–కాలేజీ రోడ్డు!
భద్రాచలం,చర్ల, నవంబర్ 26 (ప్రభ న్యూస్):
చర్ల మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని, భద్రాచలం నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు విమర్శించారు. చర్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చర్ల బస్టాండ్ నుంచి కాలేజీ వరకు ఉన్న రహదారి నిర్మాణానికి 2025 జనవరిలో రూ.1.10 కోట్ల నిధులు మంజూరైనా, ఇప్పటివరకు పనులు పూర్తికాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. ఈ రహదారి నిర్మాణం కోసం బీఆర్ఎస్ నాయకులు రెండుసార్లు ధర్నాలు నిర్వహించగా, 2025 సెప్టెంబర్‌లో ఎమ్మెల్యే వెంకట్రావు ఆర్భాటంగా శంకుస్థాపన చేశారని, అయితే కాంట్రాక్టర్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టి పనులను మధ్యలోనే వదిలేశారని పేర్కొన్నారు. శంకుస్థాపన జరిగి నెలలు గడుస్తున్నా రహదారి నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారి ద్వారా నిత్యం వేలాది మంది ప్రయాణికులు, కళాశాల విద్యార్థులతో పాటు విజయ కాలనీ, లక్ష్మీ కాలనీ, దేవానగరం, దోశిళ్లపల్లి, పెద్దమిడిసిలేరు, తిప్పాపురం పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని, ఇంతటి ప్రాధాన్యత కలిగిన రహదారి నిర్మాణాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. అలాగే భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు ఉన్న రహదారి సమస్యను కూడా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గానికి వస్తున్నప్పటికీ ప్రజల రహదారి సమస్యలకు పరిష్కారం లభించడం లేదని ప్రజలు వాపోతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే గెలిచి మూడేళ్లు కావస్తున్నా కనీసం కీలకమైన రహదారుల నిర్మాణాలు పూర్తి చేయించలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్ల బస్టాండ్–కాలేజీ రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయించాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన నిలబడి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని దొడ్డి తాతారావు హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

