50 ఏళ్లలో ఎన్నడూ లేనంత సంక్షోభం
గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రమైన సంక్షోభాన్ని పౌల్ట్రీ పరిశ్రమ ఎదుర్కొంటోందని అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. కోళ్ల దాణా తయారీకి అవసరమైన మొక్కజొన్న, సోయాబీన్ ధరలు పెరగడంతో పాటు వాటి సరఫరాపై కూడా ఆందోళన నెలకొందని వివరించింది. కోళ్ల దాణా ధర టన్నుకు సుమారు రూ.15,000 పెరిగిందని AIPBA అధ్యక్షుడు బహదూర్ అలీ తెలిపారు. దీంతో కోళ్ల పెంపకం ఖర్చు భారీగా పెరిగి, వ్యాపారం చేయడం కష్టంగా మారిందన్నారు. కొంతమంది రైతులు కోళ్ల ఉత్పత్తిని తగ్గించగా, మరికొందరు ఫారాలను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు.
మొక్కజొన్న, సోయాబీన్ పంటల ఉత్పత్తి సరిపడా ఉన్నప్పటికీ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని బహదూర్ అలీ ఆరోపించారు. కొందరు వ్యాపారులు సరుకును నిల్వ చేసి మార్కెట్లోకి విడుదల చేయకపోవడం వల్లే ధరలపై అనవసరమైన ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం వివిధ రాష్ట్రాల్లో ఈ రెండు పంటల ఉత్పత్తి తగినంతగా ఉందని ఆయన గుర్తుచేశారు. కాబట్టి ప్రస్తుతం కనిపిస్తున్న కొరత నిజమైన ఉత్పత్తి లోటు వల్ల వచ్చినది కాదని అసోసియేషన్ అభిప్రాయపడింది.
పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం
పరిశ్రమ అంచనాల ప్రకారం, కోళ్ల దాణా తయారీ ప్లాంట్లలో ఉత్పత్తి, డిమాండ్ రెండూ 15 నుంచి 20 శాతం వరకు తగ్గాయి. పౌల్ట్రీ ఫారాల్లో 20 నుంచి 25 శాతం ఇప్పటికే మూతపడ్డాయి. మరికొన్ని ఫారాలు కూడా మూతపడే పరిస్థితిలో ఉన్నాయని అసోసియేషన్ తెలిపింది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రధాన పౌల్ట్రీ ఉత్పత్తి రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లోనూ ఈ సమస్య ప్రభావం చూపుతోందని వెల్లడించింది.
కిలో చికెన్ అమ్మినా రూ.40-50 నష్టం
దాణా ధరలు పెరిగిన స్థాయిలో చికెన్ ధరలు పెరగకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం కిలో చికెన్ అమ్మకంపై రైతులకు సుమారు రూ.40 నుంచి రూ.50 వరకు నష్టం వస్తోందని అసోసియేషన్ తెలిపింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీ కంపెనీలు సంపాదించిన లాభాలన్నీ నవంబర్ నాటికి తుడిచిపెట్టుకుపోయాయని పేర్కొంది. ఈ పరిస్థితి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను దాదాపుగా లేకుండా పోవచ్చని తెలిపింది.
దాణా ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే చికెన్ ధర కిలోకు మరో రూ.40 నుంచి రూ.50 వరకు పెరగొచ్చని అసోసియేషన్ హెచ్చరించింది. గుడ్డు ధర కూడా ఒక్కొక్కటికి రూ.3 నుంచి రూ.4 వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మొక్కజొన్న ధరలు పెరగడం వల్ల ఇథనాల్ తయారీ ప్లాంట్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ఇప్పటికే పలు ఇథనాల్ ప్లాంట్లు కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చిందని వెల్లడించింది.
జనవరి నుంచి కొంత ఊరట లభిస్తుందా?
మొక్కజొన్న, సోయాబీన్ ధరలు జనవరి నాటికి కొంత తగ్గే అవకాశం ఉందని అసోసియేషన్ అంచనా వేస్తోంది. అయితే సమీప భవిష్యత్తులో ధరలు, సరఫరా పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై ఇంకా స్పష్టత లేదని తెలిపింది. దాణా ధరలు ఇలాగే పెరుగుతూ, సరఫరాలో అంతరాయాలు కొనసాగితే పౌల్ట్రీ, డెయిరీ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది గ్రామీణ కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడుతుందని బహదూర్ అలీ హెచ్చరించారు. మొత్తంగా చూస్తే మొక్కజొన్న, సోయాబీన్ ధరల పెరుగుదల పౌల్ట్రీ రైతులకే కాకుండా సాధారణ వినియోగదారులకూ భారంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోకపోతే చికెన్, గుడ్ల ధరలు పెరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంది.
