Last Updated:
రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు రాకుండా కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో చేరిన వారికి రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. మరి ఈ పథకంలో చేరాలంటే ఎంత చెల్లించాలి? ఎవరెవరు అర్హులు? ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చా? పూర్తి వివరాలు తెలుసుకోండి.
వ్యవసాయంపై ఆధారపడి జీవించే చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పింఛను పథకాన్ని అమలు చేస్తోంది. అదే ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన (PM-KMY). ఈ పథకంలో చేరిన రైతులు 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా కనీసం రూ.3,000 పెన్షన్ పొందవచ్చు. అయితే, ఇందులో చేరాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. రైతులు తమ వయసును బట్టి నెలకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమానంగా జమ చేస్తుంది.
చిన్న, సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 12న ఈ పథకాన్ని ప్రారంభించింది. వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇది కొనసాగుతోంది. భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఈ పథకానికి పెన్షన్ నిధుల నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. 2026 ప్రారంభం నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 24.96 లక్షల మంది రైతులు ఇందులో నమోదు చేసుకున్నారు.
ఈ పథకంలో చేరే సమయంలో రైతు వయసును బట్టి నెలవారీ చందా నిర్ణయిస్తారు. 18 ఏళ్ల వయసులో చేరితే రూ.55, 25 ఏళ్లకు రూ.80, 30 ఏళ్లకు రూ.105, 35 ఏళ్లకు రూ.150, 40 ఏళ్లకు రూ.200 చెల్లించాలి. రైతు ఎంత మొత్తం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని తన వంతుగా జమ చేస్తుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వయసులో చేరిన రైతు రూ.105 చెల్లిస్తే, ప్రభుత్వం మరో రూ.105 కలిపి మొత్తం రూ.210 జమ చేస్తుంది. ఈ చందా 60 ఏళ్లు వచ్చే వరకు మారదు.
రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతాల భూమి రికార్డుల ప్రకారం గరిష్ఠంగా రెండు హెక్టార్ల (సుమారు 4.94 ఎకరాలు) సాగుభూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. చేరే సమయంలో వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, పీఎస్‌యూ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు వంటి ప్రజాప్రతినిధులకు అవకాశం లేదు. వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌ల వంటి నమోదిత వృత్తి నిపుణులు కూడా అర్హులు కారు. ఎన్‌పీఎస్, ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ, పీఎం-శ్రమ్ యోగి మాన్‌ధన్, పీఎం-లఘు వ్యాపారి మాన్‌ధన్ పథకాల పరిధిలో ఉన్నవారికీ ఈ పథకం వర్తించదు.
రైతుకు 60 ఏళ్లు నిండిన తర్వాత మరణిస్తే, ఆయన భార్య లేదా భర్తకు జీవితాంతం నెలకు రూ.1,500 కుటుంబ పెన్షన్ అందుతుంది. ఈ ప్రయోజనం జీవిత భాగస్వామికే వర్తిస్తుంది. పిల్లలకు ఇది వర్తించదు. పీఎం-కిసాన్ లబ్ధిదారులు తమ వార్షిక రూ.6,000 సాయం నుంచి నెలవారీ చందాను నేరుగా మినహాయించుకునేలా అనుమతి ఇవ్వవచ్చు.
సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)లో ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, ఐఎఫ్‌ఎస్‌సీ వివరాలు, మొబైల్ నంబరుతో నమోదు చేసుకోవచ్చు. అధికారిక మాన్‌ధన్ పోర్టల్‌లో ఆధార్ ఓటీపీ ద్వారా స్వయంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. నమోదు కోసం రైతుల నుంచి రుసుము వసూలు చేయరు. రూ.30 రిజిస్ట్రేషన్ ఛార్జీని ప్రభుత్వమే కేంద్రానికి చెల్లిస్తుంది. కేంద్రం వద్ద వివరాలు నమోదు చేసిన తర్వాత బ్యాంకు నుంచి చందా మినహాయింపునకు అంగీకార పత్రంపై సంతకం చేయాలి. తొలి చందా జమ కాగానే కిసాన్ పెన్షన్ ఖాతా సంఖ్య (KPAN), పెన్షన్ కార్డు జారీ అవుతాయి.

