Last Updated:
Robbery: ఆనందోత్సాహాల మధ్య సాగుతున్న ఓ వివాహ వేడుకలో అతిథి వేషంలో వచ్చిన దొంగ తన చేతివాటం ప్రదర్శించాడు.
బంధువులంతా డ్యాన్సులు చేస్తూ వేడుకలో మునిగిపోయిన సమయాన్ని ఆసరాగా చేసుకుని, ఏకంగా రూ. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 2.5 లక్షల నగదు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ నగరంలో ఈ సంచలన ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగింది?పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 20న ఘజియాబాద్ నగరంలోని ఒక ప్రముఖ ఫంక్షన్ హాల్లో వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి ఆహ్వానితుడిలా నీటుగా తయారై వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి, ఎవరికీ అనుమానం రాకుండా పెళ్లి బృందం, బంధువులలో కలిసిపోయాడు. వేడుకలో భాగంగా బంధువులందరూ డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా గడుపుతున్న సమయంలో, అక్కడే ఉంచిన విలువైన బ్యాగుపై ఆ దొంగ కన్నేశాడు. ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకున్న తర్వాత, క్షణాల్లో ఆ బ్యాగును తీసుకుని అక్కడి నుండి ఉడాయించాడు.
కొంతసేపటి తర్వాత బంధువులు బ్యాగు కోసం వెతకగా అది కనిపించలేదు. దీంతో కంగారుపడిన బాధితులు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన బ్యాగులో పెళ్లి కోసం తెచ్చిన సుమారు రూ. 20 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు, రూ. 2.5 లక్షల నగదు కూడా ఉన్నట్లు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఫంక్షన్ హాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడు సాధారణ అతిథిలా లోపలికి రావడం, అందరితో కలిసి తిరగడం, అదును చూసి బ్యాగును ఎత్తుకెళ్లడం వంటి దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో విలువైన వస్తువులు, నగదు పట్ల నిర్వాహకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు.

