Last Updated:
Jensen Huang Returns as CEO: ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టిస్తున్న దిగ్గజ చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ సీఈఓ పదవికి రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్ను బోర్డు మళ్లీ అదే బాధ్యతల్లో నియమించింది. ఆయన పదవి నుంచి తప్పుకున్న రెండు వారాలు కూడా గడవకముందే ఈ నిర్ణయం తీసుకోవడం టెక్ రంగంతో పాటు స్టాక్ మార్కెట్లోనూ చర్చనీయాంశంగా మారింది. అ
నిన్న మొన్నటి వరకూ ప్రపంచాన్ని షేక్ చేసిన దిగ్గజ చిప్ తయారీ సంస్థ అయిన ఎన్విడియాలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ సీఈఓ పదవికి రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్ను బోర్డు మళ్లీ అదే బాధ్యతల్లోకి తీసుకుంది. ఆయన రాజీనామా చేసిన రెండు వారాలు కూడా గడవకముందే కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం టెక్, స్టాక్ మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం, ప్రభుత్వ ఉన్నతాధికారుల సూచనల తర్వాత బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే ఎన్విడియా షేర్లు 31 శాతానికి పైగా పెరిగాయి.
జెన్సన్ హువాంగ్‌తో పలుమార్లు చర్చలు జరిపిన తర్వాత ఆయనను తిరిగి నియమించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఎన్విడియా వెల్లడించింది. కంపెనీని సమర్థంగా నడిపించే సామర్థ్యం, ఆయన ఇచ్చిన వివరణలపై బోర్డు సంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నామని, హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడం వల్ల దేశ భద్రతకు ముప్పు ఉండదని భావిస్తున్నామని తెలిపింది. బోర్డు ఛైర్మన్ హార్వే సి. జోన్స్ మాట్లాడుతూ.. కంపెనీ భవిష్యత్తు, ఉద్యోగులు, వాటాదారులు, వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా హువాంగ్ సరైన నాయకుడని పేర్కొన్నారు.
తిరిగి బాధ్యతలు చేపట్టడంపై హువాంగ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని కీలక టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన ఎన్విడియాకు నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన బోర్డుకు, ఈ మధ్యకాలంలో కంపెనీని నడిపించిన కోలెట్ క్రెస్, ఇతర ఉద్యోగులకు కృతజ్ఞతలు చెప్పారు. ఇకపై కోలెట్ క్రెస్ తిరిగి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా కొనసాగుతారు. హార్వే జోన్స్ బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు.
హువాంగ్‌పై విదేశీ గూఢచర్యానికి సంబంధించిన ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్విడియా స్వతంత్ర దర్యాప్తును కొనసాగించనుంది. ఇందుకోసం స్వతంత్ర డైరెక్టర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, న్యాయ నిపుణుల సహాయం తీసుకుంటోంది. వాణిజ్య నిబంధనలు, చిప్‌ల ఎగుమతులు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించేందుకు మరో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సంస్థ అంతటా నిబంధనల అమలును చూసేందుకు చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్‌ను నియమించే ప్రక్రియను ప్రారంభించింది. అమెరికా ప్రభుత్వ దర్యాప్తులకు పూర్తిగా సహకరిస్తామని కంపెనీ తెలిపింది.
హువాంగ్ను తిరిగి సీఈఓగా నియమించడాన్ని ట్రంప్ స్వాగతించారు. ఇది సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. గతంలోనూ ఆయన హువాంగ్ను తిరిగి తీసుకోవాలని ఎన్విడియా బోర్డుకు సూచించినట్లు వెల్లడించారు. హువాంగ్‌పై చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆధారాలు లేవని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు, అకౌంటింగ్ వ్యవహారాలు, చిప్‌ల అక్రమ రవాణా ఆరోపణలపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, న్యాయ శాఖ దర్యాప్తులు కొనసాగుతున్నాయి. దీంతో హువాంగ్ పునరాగమనంతో షేర్లు పెరిగినా, కంపెనీపై ఉన్న దర్యాప్తులు, వాటి ఫలితాలు భవిష్యత్తులో కీలకంగా మారనున్నాయి.

