Last Updated:
వాట్సాప్‌లో వైరల్ అవుతున్న రూ.30,000 ప్రభుత్వ సబ్సిడీ మెసేజ్ నిజం కాదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. అసలు ఆ మెసేజ్ ఏంటీ? ఎందుకు వైరల్ అవుతోంది? తెలుసుకోండి.
ప్రతి భారతీయుడికి కేంద్ర ప్రభుత్వం రూ.30,000 సబ్సిడీ ఇస్తోందంటూ వాట్సాప్‌లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. ‘గవర్నమెంట్ యూనివర్సల్ సబ్సిడీ ప్రోగ్రామ్ 2026’ పేరుతో ప్రచారం చేస్తున్న ఈ మెసేజ్ పూర్తిగా నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇలాంటి మెసేజ్‌లను నమ్మి లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించింది. వాట్సాప్‌లో షేర్ అవుతున్న ఈ మెసేజ్‌లో భారత పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వం రూ.30,000 సబ్సిడీ అందిస్తోందని చెబుతున్నారు. ఇందుకోసం గడువు ముగిసేలోపు ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఆఫర్ నిజమైనదేనని నమ్మించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేరును వాడటంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును కూడా ప్రస్తావిస్తున్నారు.
అంతేకాదు, ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా నిధులు పంపిణీ చేశారని, 1,94,259 మందికి డబ్బులు అందాయని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే వేగంగా ఆమోదం లభిస్తుందని, ప్రాథమికంగా సబ్సిడీ మంజూరు చేస్తామని చెబుతున్నారు. ఈ డబ్బులు పొందాలంటే తమ పేర్లు నమోదు చేయాలని ప్రజలను కోరుతున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ప్రకటించలేదని స్పష్టం చేసింది. ప్రతి పౌరుడికి రూ.30,000 అందించే ‘గవర్నమెంట్ యూనివర్సల్ సబ్సిడీ ప్రోగ్రామ్ 2026’కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రభుత్వ ప్రకటన కూడా లేదు.
ఇలాంటి తప్పుడు మెసేజ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీఐబీ సూచించింది. వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దని హెచ్చరించింది. గుర్తు తెలియని వెబ్సైట్లలో వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ సమాచారం, ఇతర రహస్య వివరాలు నమోదు చేయకూడదని తెలిపింది. ప్రభుత్వ లోగోలు, బ్యాంకుల పేర్లు, ప్రభుత్వ పెద్దల ప్రస్తావన ఉన్నంత మాత్రాన ఒక మెసేజ్ నిజమని నమ్మకూడదు. అలాంటి మెసేజ్‌లను ఇతరులకు ఫార్వర్డ్ చేయడం కూడా మంచిది కాదు. ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సాయం గురించి ఏదైనా సమాచారం వస్తే ముందుగా అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లలో పరిశీలించిన తర్వాతే నమ్మాలని సూచించింది.
నకిలీ ప్రభుత్వ సమాచారాన్ని ఎలా ఫిర్యాదు చేయాలి?
ప్రభుత్వ పథకాల పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు ప్రజలు కూడా సహకరించాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కోరింది. అనుమానాస్పద ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లను పరిశీలన కోసం పీఐబీకి పంపవచ్చని తెలిపింది.
వాట్సాప్: +91 8799711259
ఈమెయిల్: factcheck@pib.gov.in
ఎక్స్ (గతంలో ట్విట్టర్): @PIBFactCheck
టెలిగ్రామ్: t.me/PIB_FactCheck
ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే ప్రతి మెసేజ్‌ను గుడ్డిగా నమ్మకుండా, దాని నిజానిజాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉచిత డబ్బులు, సబ్సిడీలు, ఆర్థిక సాయం అంటూ వచ్చే లింకుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అధికారిక సమాచారం ఉందో లేదో నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలి. ఇలా అప్రమత్తంగా ఉండటం వల్ల ఆన్లైన్ మోసాల బారిన పడకుండా మన డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవచ్చు.

