Last Updated:
Kakinada: జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో ‘అమ్మతోడు అడ్డంగా నరికేస్తా’ అనే డైలాగ్ ఉంటుంది. అప్పట్లో ఈ డైలాగ్ చాలా పాపులర్. ఇప్పటికీ చాలా మంది ఈ డైలాగ్‌ను వాడుతుంటారు. అయితే కాకినాడలో ఇదే డైలాగ్‌ను ఒక కుక్క తనదైన శైలిలో చెప్పింది.
“విశ్వసనీయతకు మారుపేరు కుక్క” అని ఊరికే అనరు. యజమాని కుటుంబానికి కష్టం వస్తే తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అండగా నిలబడతానని నిరూపించింది ఓ పెంపుడు శునకం. ఇంట్లోకి చొరబడుతున్న భయంకరమైన తాచుపామును అడ్డుకుని, దానితో పోరాడి మరీ చంపేసింది. ఈ ఆసక్తికరమైన ఘటనా కాకినాడ జిల్లాలో వెలుగుచూసింది.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఉల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ‘బాక్సర్’ (Boxer) జాతికి చెందిన కుక్కను ఎంతో ప్రాణంగా పెంచుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నం సమయంలో శ్రీనివాస్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలం నుండి ఒక పెద్ద తాచుపాము హఠాత్తుగా ఇంట్లోకి రావడం ప్రారంభించింది. కాటేసేందుకు బుసలు కొడుతూ వస్తున్న ఆ పామును చూసి ఇంట్లోని కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురై గట్టిగా కేకలు వేశారు.
కుటుంబసభ్యుల కేకలు విన్న పెంపుడు కుక్క క్షణాల్లో అప్రమత్తమైంది. యజమాని కుటుంబానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి, పామును ఇంట్లోకి రానివ్వకుండా గుమ్మం ముందే అడ్డుకుంది. ఈ క్రమంలో పాముకు, శునకానికి మధ్య కాసేపు హోరాహోరీ పోరాటం నడిచింది. పాము పడగ విప్పి కుక్క మూతిపై బలంగా కాటు వేసింది. పాము కాటేసినా సరే ఆ శునకం వెనకడుగు వేయలేదు. పంతంతో ఆ తాచుపామును తన నోటితో గట్టిగా కరుచుకుని, నేలకేసి కొడుతూ ముక్కలు ముక్కలుగా మార్చి అక్కడికక్కడే చంపేసింది.
పాము చనిపోవడంతో శ్రీనివాస్ కుటుంబసభ్యులు భయం నుండి కోలుకుని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే విషపూరితమైన తాచుపాము కాటు వేయడంతో ఆ శునకం తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే స్పందించిన యజమాని, దానిని చికిత్స నిమిత్తం కాకినాడలోని వెటర్నరీ (పశువుల) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆ మూగజీవానికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. తమ ప్రాణాలను కాపాడిన పెంపుడు కుక్క త్వరగా కోలుకోవాలని యజమాని కుటుంబం ప్రార్థిస్తోంది. తమ ప్రాణాలకు అడ్డుపడిన ఆ శునకంపై స్థానికులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Hyderabad,Telangana

