Last Updated:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 16, 17 తేదీల్లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో పర్యటించనున్నారు. 23వ ఆసియాన్-ఇండియా సదస్సు, 21వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొని కీలక అంశాలపై చర్చించనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం (నవంబర్ 16) నుంచి రెండు రోజుల పాటు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో పర్యటించనున్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్. మార్కోస్ జూనియర్ ఆహ్వానం మేరకు ఈ పర్యటనకు వెళ్తున్న ప్రధాని మోదీ, మంగళవారం (నవంబర్ 17) జరగనున్న 23వ ఆసియాన్-ఇండియా సదస్సు, 21వ తూర్పు ఆసియా సదస్సు (ఈఏఎస్)లో పాల్గొంటారు. ఈ ఏడాది ఆసియాన్ కూటమికి ఫిలిప్పీన్స్ అధ్యక్షత వహిస్తోంది. 2014లో బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ హాజరవుతున్న 13వ ఆసియాన్-ఇండియా సదస్సు ఇది.
పర్యటనలో భాగంగా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఏర్పాటు చేసే విందుతో పాటు వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు, ప్రవాస భారతీయులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. 49వ ఆసియాన్ సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలు దేశాల నేతలు మనీలాకు చేరుకుంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
2026 ఏడాదిని ‘ఆసియాన్-ఇండియా సముద్ర సహకార సంవత్సరం’గా ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటనకు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ‘మిలన్ 2026’, కొచ్చిలో జరిగిన సముద్ర భద్రత సదస్సు, రక్షణ ఎగుమతుల పెరుగుదలతో ఇరు పక్షాల బంధం బలపడింది. ఆసియాన్ సదస్సులో 2026-2030 కార్యాచరణ ప్రణాళిక అమలుతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ రంగాల్లో కొత్త అవకాశాలపై నేతలు సమీక్షిస్తారు. తూర్పు ఆసియా సదస్సులో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం, అంతర్జాతీయ చట్టాల గౌరవంతో పాటు ఉగ్రవాదం, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ కట్టడిపై భారత్ గళమెత్తనుంది.
భారత్ ‘యాక్ట్ ఈస్ట్’ విధానానికి ఆసియాన్ వెన్నెముకలా నిలుస్తోంది. 1992లో ప్రారంభమైన ఈ సంబంధాలు 2022లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఎదిగాయి. 2014 నుంచి ఆసియాన్-ఇండియా ఫండ్ ద్వారా 35 మిలియన్ డాలర్ల విలువైన వందకు పైగా ప్రాజెక్టులు, మెకాంగ్ గంగా సహకారంతో 237 ప్రాజెక్టులకు భారత్ నిధులు అందించింది. నలంద విశ్వవిద్యాలయంలో 500 మందికి పైగా ఆసియాన్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, 10 వేలకు పైగా శిక్షణా అవకాశాలు కల్పించింది. 2027లో భారత్-ఆసియాన్ సంబంధాలకు 35 ఏళ్లు పూర్తికానున్న వేళ ఈ మనీలా సదస్సు కీలక మైలురాయి కానుంది.

