అదే సమయంలో, రైల్వే మాన్యువల్స్‌లో ఉపయోగిస్తున్న ‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ అనే పదాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ పదం ప్రయాణికుడిని ఒక వర్గంగా గుర్తించేలా ఉందని అభిప్రాయపడిన ధర్మాసనం, వర్గీకరణను ప్రయాణికుడికి కాకుండా కోచ్‌కు అనుసంధానించాలని సూచించింది. అంటే, ‘సెకండ్ క్లాస్ కోచ్’ అనే విధంగా పేర్కొనడం రాజ్యాంగ స్ఫూర్తికి మరింత అనుగుణంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ నోంగ్‌మైకాపమ్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం చేసింది. 2015లో కదులుతున్న రైలు నుంచి పడిపోయి మరణించిన ఓ వ్యక్తి భార్య దాఖలు చేసిన అప్పీల్‌ను విచారిస్తున్న సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. కేసు విచారణలో భాగంగా రైల్వే భద్రత, ప్రయాణికుల హక్కులు, పరిహారం వంటి అంశాలపై ధర్మాసనం విస్తృతంగా పరిశీలించింది.

