Last Updated:
Bigg Boss Season 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 శనివారం ప్రోమోలో వర్షిణి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ‘ఐ యామ్ సారీ, ఐ యామ్ నాట్ సారీ’ టాస్క్‌లో భాగంగా త్రిగుణ్ తన క్యారెక్టర్ గురించి మాట్లాడి బాధపెట్టాడని నాగార్జున ముందే కన్నీళ్లు పెట్టుకుంది.
Bigg Boss Telugu 10: బుల్లితెరపై అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’లో వీకెండ్ ఎపిసోడ్స్ అంటేనే ఓ రేంజ్ ఎమోషన్స్, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. శనివారం కావడంతో హోస్ట్ కింగ్ నాగార్జున కంటెస్టెంట్ల ఆటతీరుపై క్లాస్ పీకడానికి రెడీ అయ్యారు. తాజాగా ఈ రోజు రాత్రి ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కంటెస్టెంట్ల మధ్య ఉన్న మనస్పర్థలను బయటపెట్టేలా నాగార్జున ఇచ్చిన టాస్క్ హౌస్‌లో వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ముఖ్యంగా యాంకర్ వర్షిణి, నటుడు త్రిగుణ్ మధ్య జరిగిన ఎమోషనల్ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో భాగంగా నాగార్జున ‘ఐ యామ్ సారీ, ఐ యామ్ నాట్ సారీ’ అనే ఒక ఆసక్తికరమైన టాస్క్ పెట్టారు. ఈ గేమ్ రూల్స్ ప్రకారం.. ఒక కంటెస్టెంట్ ‘విక్టిమ్’ (బాధిత) స్థానంలో నిలబడి, హౌస్‌లో తమను తీవ్రంగా బాధపెట్టిన కంటెస్టెంట్ పేరు చెప్పి ‘అక్యూజ్డ్’ (నిందితుడు) స్థానంలో నిలబెట్టాలి. బాధితులు చెప్పిన కారణం విన్నాక, ఎదుటి వ్యక్తి తాను చేసిన పనికి పశ్చాత్తాపపడితే ‘ఐ యామ్ సారీ’ బజర్ నొక్కాలి, లేదంటే ‘ఐ యామ్ నాట్ సారీ’ బజర్ ప్రెస్ చేయాలి.
ఈ టాస్క్‌లో భాగంగా నాగార్జున వర్షిణిని విక్టిమ్ స్థానంలోకి పిలవగా.. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా త్రిగుణ్‌ను అక్యూజ్డ్ స్థానంలో నిలబెట్టింది. నాగార్జున ముందు తన ఆవేదనను వెళ్లగక్కుతూ వర్షిణి కన్నీళ్లు పెట్టుకుంది. “త్రిగుణ్ నా క్యారెక్టర్ గురించి మాట్లాడాడు సార్. ఆ మాటలకు నేను చాలా హర్ట్ అయ్యాను, కానీ ఆ బాధను హౌస్‌లో ఎవరికీ చెప్పుకోలేకపోయాను. లోలోపలే కుమిలిపోయాను. కనీసం మా అమ్మతోనైనా చెప్పుకుని ఏడుద్దామనుకున్నాను కానీ, ఇక్కడ అది కుదరలేదు” అంటూ వర్షిణి వెక్కి వెక్కి ఏడ్చేసింది.
వర్షిణి, త్రిగుణ్‌లకు బిగ్ బాస్ హౌస్‌లోకి రాకముందు నుంచే మంచి పరిచయం ఉంది. ఒక తెలిసిన స్నేహితుడే తన వ్యక్తిత్వం గురించి అలాంటి కామెంట్స్ చేసేసరికి వర్షిణి ఆ షాక్‌ను తట్టుకోలేకపోయినట్లు స్పష్టంగా కనిపించింది. ఇక వర్షిణి మాటలు విన్న తర్వాత త్రిగుణ్ ‘ఐ యామ్ సారీ’ బజర్ ప్రెస్ చేశాడు. “ఐ యామ్ రియల్లీ సారీ వర్షిణి.. ఆ రోజు నేను నీతో అంత గట్టిగా మాట్లాడకుండా ఉండాల్సింది” అంటూ తన తప్పును ఒప్పుకున్నాడు.
అయితే అసలు త్రిగుణ్, వర్షిణి క్యారెక్టర్ గురించి అంతలా ఏం కామెంట్స్ చేశాడు? వీరిద్దరి మధ్య ఎక్కడ చెడింది? అనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ రోజు రాత్రి ప్రసారం కానున్న ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే!

