మూర్ఛ వ్యాధి అంటే?
మెదడులోని నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధినే మూర్ఛ వ్యాధి అంటారు. ఇందులో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే పదే పదే మూర్ఛ వచ్చే అవకాశం ఉంటుంది. మెదడులో విద్యుత్ సంకేతాల కార్యకలాపాలు ఒక్కసారిగా అసాధారణంగా మారినప్పుడు మూర్ఛ వస్తుంది. ఆ సమయంలో వ్యక్తి కదలికలు, ప్రవర్తన, అనుభూతులు లేదా చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించే సామర్థ్యంలో తాత్కాలిక మార్పులు రావచ్చు.
మూర్ఛ వచ్చిందంటే ప్రతిసారీ వ్యక్తి కిందపడిపోవడం లేదా శరీరం బలంగా కొట్టుకోవడం జరగదు. కొందరిలో కొద్దిసేపు ఒకే చోట తదేకంగా చూడటం, అయోమయానికి గురవడం, వింత అనుభూతులు కలగడం, పదే పదే ఒకే కదలికలు చేయడం లేదా తాత్కాలికంగా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉండవచ్చు.
ఒక్కసారి మూర్ఛ వచ్చినంత మాత్రాన ఆ వ్యక్తికి ఎపిలెప్సీ ఉందని నిర్ధారించలేం. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు, మూర్ఛ వచ్చిన తీరు, లక్షణాలు, వైద్య పరీక్షల ఆధారంగా వైద్యులు ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.
మూర్ఛ వ్యాధికి కారణం?
మూర్ఛ వ్యాధి ఏ వయసులోనైనా రావచ్చు. మెదడుకు గాయాలు కావడం, పక్షవాతం (స్ట్రోక్), మెదడుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు, జన్యుపరమైన కారణాలు, ఎదుగుదలకు సంబంధించిన సమస్యలు, మెదడు నిర్మాణంలో కొన్ని అసాధారణ మార్పులు ఈ వ్యాధికి కారణం కావచ్చు. అయితే, కొందరిలో వ్యాధి రావడానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు.
ఇప్పటికే మూర్ఛ వ్యాధి ఉన్నవారిలో, సరైన నిద్ర లేకపోవడం, మితిమీరి మద్యం సేవించడం, మందులు సరిగ్గా వేసుకోకపోవడం, అనారోగ్యానికి గురికావడం వంటివి మూర్ఛ రావడానికి కారణమవుతాయి. ఇలాంటి కారణాలను గుర్తించి వాటికి దూరంగా ఉండటం వ్యాధిని నియంత్రించడంలో ముఖ్యమైన భాగం.
మూర్ఛ వ్యాధిని ఎలా నిర్ధారిస్తారు?
సరైన నిర్ధారణ చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్నిసార్లు మూర్ఛ లక్షణాలు స్పృహ తప్పడం లేదా నిద్రకు సంబంధించిన కొన్ని సమస్యల లక్షణాల మాదిరిగా కనిపించవచ్చు.
న్యూరాలజిస్టులు రోగికి కనిపించిన లక్షణాలు, గత వైద్య చరిత్ర, మూర్ఛ వచ్చినప్పుడు ఎదురైన పరిస్థితులను పరిశీలిస్తారు. ఆ సమయంలో పక్కన ఉన్నవారు గమనించిన విషయాలను కూడా తెలుసుకుంటారు.
మెదడులోని విద్యుత్ కార్యకలాపాలను నమోదు చేసే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ (EEG) పరీక్ష చేయవచ్చు. అలాగే మెదడు నిర్మాణంలో ఏవైనా అసాధారణ మార్పులు ఉన్నాయో తెలుసుకోవడానికి MRI వంటి స్కానింగ్ పరీక్షలు కూడా నిర్వహించవచ్చు.
మూర్ఛ వ్యాధికి చికిత్స ఉందా?
ఉంది. మూర్ఛ వ్యాధి ఉన్న చాలామందికి యాంటీ సీజర్ మందులే ప్రధాన చికిత్సగా ఉంటాయి. ఏ మందులు ఇవ్వాలనేది మూర్ఛ రకం, రోగి వయసు, ఇతర ఆరోగ్య సమస్యలు, చికిత్సకు వారు స్పందిస్తున్న తీరు, ఇలా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
మందులతో చాలామందిలో మూర్ఛను సమర్థంగా నియంత్రించవచ్చు. సరైన మందులు వాడుతున్నప్పటికీ మూర్ఛ వస్తూనే ఉంటే, వారి పరిస్థితిని బట్టి ఇతర చికిత్సా విధానాలను కూడా పరిశీలించవచ్చు. వీటిలో మూర్ఛ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్స, ప్రత్యేక ఆహార విధానాలు, న్యూరోస్టిమ్యులేషన్ వంటి చికిత్సలు ఉంటాయి.
ఎన్నాళ్లుగానో మూర్ఛ రాకపోయినా, న్యూరాలజిస్టును సంప్రదించకుండా మందులను ఆపడం లేదా మోతాదు తగ్గించడం ఎప్పుడూ చేయకూడదు.
వయసు పెరిగే కొద్దీ మూర్ఛ వ్యాధి తగ్గిపోతుందా?
మూర్ఛ వ్యాధి తప్పనిసరిగా జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు. చిన్నతనంలో వచ్చే కొన్ని రకాల మూర్ఛ వ్యాధులు వయసు పెరిగే కొద్దీ తగ్గిపోవచ్చు లేదా పూర్తిగా నయమవ్వవచ్చు. మరికొందరిలో కొన్ని సంవత్సరాల పాటు మూర్ఛ రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో నిపుణుల పర్యవేక్షణలో క్రమంగా మందులను నిలిపివేయడాన్ని పరిశీలించవచ్చు. అయితే, కొందరికి మాత్రం దీర్ఘకాలం పాటు చికిత్స అవసరమవుతుంది.
వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించడం, వైద్యుల పర్యవేక్షణలో ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. సరైన వైద్య సంరక్షణతో మూర్ఛ వ్యాధిని సమర్థంగా నియంత్రించుకోవచ్చు. తద్వారా చాలామంది తమ చదువు, ఉద్యోగం, కుటుంబ జీవితం, రోజువారీ పనులను మరింత ఆత్మవిశ్వాసంతో కొనసాగించగలరు.
