Last Updated:
Tamil Nadu CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిన నేపథ్యంలో TVK అధినేత, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర రహస్య సమావేశం నిర్వహించారు.
మహాబలిపురంలోని ఒక రిసార్ట్‌లో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్యేల పనితీరు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విజయ్ సుదీర్ఘంగా చర్చించి పలు కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం గురించి వివరిస్తూ, రాష్ట్రంలో కాంగ్రెస్ మినహా మిగిలిన అన్ని పార్టీలు ఏకమై తమపై పోరాడుతున్నాయని విజయ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో టీవీకే ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు ఉచ్చు బిగించే ప్రయత్నాలు చేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రత్యర్థుల ప్రలోభాలకు గానీ, కుట్రలకు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోవద్దని స్పష్టం చేశారు.
ఇటీవల కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తనపై వస్తున్న ఆరోపణలు, వివాదాల పట్ల విజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులుగా బాధ్యతాయుతంగా మెలగాలని, మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని హితవు పలికారు. ఎవరైనా ఎమ్మెల్యేలు అక్రమాలకు, తప్పులకు పాల్పడినట్లు తేలితే పార్టీ ప్రతిష్ఠ దృష్ట్యా వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోమని గట్టిగా హెచ్చరించారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఎమ్మెల్యేలందరూ ఐక్యతతో, ఒకరికొకరు అండగా కలిసి ఉండాలని విజయ్ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో, గత ఆరు నెలల కాలంలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారంపై రూపొందించిన ‘సిక్స్ మంత్స్ అసెస్‌మెంట్ రిపోర్ట్ కార్డు’ను (నివేదికను) విజయ్ స్వయంగా సమీక్షించారు. ఎమ్మెల్యేలతో విడివిడిగా మరియు బృందాలుగా సమావేశమై వారి పనితీరుపై ఫీడ్‌బ్యాక్ తీసుకుని దిశానిర్దేశం చేశారు.

