Last Updated:
పొట్ట తగ్గించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, చేస్తున్నా బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అయితే మీ ఆహారపు అలవాట్లలోనూ కొన్ని పొరపాట్లు ఉండవచ్చు. పొట్ట చుట్టూ కొవ్వు తగ్గకపోవడానికి గల కారణాలు, బరువు తగ్గేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.
ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం ప్రధానమైనవి. వీటిని తగ్గించుకోవడానికి కొందరు ప్రతిరోజూ జిమ్‌కు వెళ్తుంటారు. ట్రెడ్‌మిల్‌పై పరుగులు తీయడం, బరువులు ఎత్తడం, పొట్ట తగ్గించే వ్యాయామాలు చేయడం వంటివి చేస్తుంటారు. అయినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించక నిరాశ చెందుతుంటారు. దీనికి వ్యాయామం ఒక్కటే కారణం కాదు. ఆహారపు అలవాట్లు, రోజువారీ జీవనశైలి కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలోని కేలరీలపై అవగాహన లేకపోతే ఎంత వ్యాయామం చేసినా ఫలితం పరిమితంగానే ఉండవచ్చు.
ఆరోగ్య నిపుణులు చెబుతున్న సాధారణ సూత్రం ప్రకారం.. శరీరంలోకి వెళ్లే కేలరీల కంటే ఎక్కువ కేలరీలను ఖర్చు చేయగలిగితేనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది. మనం తినే ఆహారం, తాగే పానీయాల ద్వారా ఎక్కువ కేలరీలు అందుకుంటూ, వాటిని ఖర్చు చేయడానికి తగినంత శారీరక శ్రమ చేయకపోతే బరువు తగ్గడం కష్టమవుతుంది. అందుకే జిమ్‌లో గడిపే సమయంతో పాటు రోజంతా తీసుకునే ఆహారంపైనా దృష్టి పెట్టాలి.
వ్యాయామం చేసేవారిలో చాలామంది శరీరానికి మంచివని భావించి ప్రొటీన్ షేక్స్, వేరుశెనగ వెన్న, ఎండిన పండ్లు, నట్స్, ఎనర్జీ బార్లు తీసుకుంటారు. వీటిలో పోషకాలు ఉన్నప్పటికీ, ఎక్కువ మోతాదులో తింటే శరీరానికి అందే కేలరీలు పెరుగుతాయి. ముఖ్యంగా నట్స్ ఆరోగ్యానికి మేలు చేసినా వాటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి పోషకాహారం పేరుతో అవసరానికి మించి తినకుండా పరిమాణాన్ని నియంత్రించుకోవాలి. స్మూతీలు, ప్రొటీన్ షేక్స్ విషయంలోనూ ఇదే జాగ్రత్త అవసరం.
క్రంచెస్, ప్లాంక్స్ వంటి వ్యాయామాలు పొట్ట భాగంలోని కండరాలను బలోపేతం చేస్తాయి. అయితే ఇవి మాత్రమే చేస్తే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ప్రత్యేకంగా కరిగిపోదు. శరీరంలోని కొవ్వు మొత్తం శరీరంలో క్రమంగా తగ్గుతుంది. అందువల్ల కార్డియో వ్యాయామాలతో పాటు బలాన్ని పెంచే శిక్షణ కూడా అవసరం.
రోజువారీ ఆహారాన్ని గమనిస్తూ, ప్రొటీన్, పీచుపదార్థాలు, కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. చక్కెర పానీయాలు, అధిక కేలరీల ఆహారాన్ని తగ్గించాలి. జిమ్‌లో వ్యాయామంతోపాటు రోజంతా చురుగ్గా ఉండాలి. బరువుతో పాటు నడుము చుట్టుకొలతను కూడా పరిశీలించాలి. ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో సమతుల్యత పాటించడం ముఖ్యం.
గమనిక: ఈ సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. బరువు తగ్గేందుకు ఆహారంలో లేదా వ్యాయామంలో మార్పులు చేసే ముందు అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.

