శరీరంలోని వివిధ భాగాల్లో కనిపించే లక్షణాలు: క్యాన్సర్ ఏ అవయవానికి సంబంధించినదనే దానిని బట్టి లక్షణాలు మారుతుంటాయి. మూత్రపిండాలు, కడుపు లేదా మూత్ర నాళాలకు సంబంధించిన సమస్యల్లో మలం లేదా మూత్రంలో రక్తం కనిపించవచ్చు. ఆకలి తగ్గడం, ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే బరువు వేగంగా తగ్గడం కూడా కొన్ని సందర్భాల్లో హెచ్చరిక సంకేతాలు కావచ్చు.
నోరు లేదా గొంతు క్యాన్సర్ ఉన్నవారిలో గొంతు దగ్గర వాపు, గడ్డలు కనిపించడం, నోటిలో తరచూ పుండ్లు ఏర్పడటం వంటి లక్షణాలు ఉండవచ్చు. మహిళల్లో రొమ్ములో గడ్డ కనిపించడం కూడా ముఖ్యమైన లక్షణంగా పరిగణించాలి. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించాయంటే తప్పనిసరిగా క్యాన్సర్ అని అర్థం కాదు. వాటికి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అయినప్పటికీ వైద్య నిపుణులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం అవసరం.
కారణం లేకుండా బరువు తగ్గుతున్నారా?
ఎలాంటి ప్రయత్నం చేయకుండానే శరీర బరువు తగ్గడం, ఆకలి గణనీయంగా తగ్గిపోవడం వంటి మార్పులను నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్ అనీష్ చెబుతున్నారు. ఉదాహరణకు, గతంలో సాధారణంగా నాలుగు రొట్టెలు తినే వ్యక్తి క్రమంగా రెండు మాత్రమే తినగలగడం, ఆ తర్వాత ఒకటి తినాలనిపించకపోవడం వంటి మార్పులు ఆకలి తగ్గుదలకు సూచన కావచ్చు.
ఐదు నుంచి ఆరు నెలల వ్యవధిలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా 10 నుంచి 15 కిలోల వరకు బరువు తగ్గితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆహారం తగ్గడం, బరువు తగ్గడం వెనుక ఉన్న అసలు కారణాన్ని పరీక్షల ద్వారా గుర్తించడం ముఖ్యం. పొగాకు, మద్యం వంటి పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు గణనీయంగా పెరుగుతుంది. అయితే ఈ అలవాట్లు లేనివారికి క్యాన్సర్ రాదని చెప్పలేం. చిన్నపిల్లల్లో కొన్ని రకాల క్యాన్సర్లు కనిపించవచ్చు. జన్యుపరమైన అంశాలు కూడా కొన్ని క్యాన్సర్లకు కారణం కావచ్చు.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, పొగాకు, మద్యానికి దూరంగా ఉండటం, జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు వైద్యుల సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. వైద్య పరీక్షల్లో క్యాన్సర్ ఉన్నట్లు తేలితే చాలామంది తీవ్ర ఆందోళనకు గురవుతారు.
అయితే క్యాన్సర్ నిర్ధారణ అంటే ఇక చికిత్సకు అవకాశం లేదని అర్థం కాదు. వ్యాధి రకం, దశ, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్స విధానాలు మారుతాయి. ప్రస్తుతం ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, రేడియేషన్, కీమోథెరపీ, శస్త్రచికిత్స వంటి ఆధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
కాబట్టి శరీరంలో అసాధారణ మార్పులు కనిపిస్తే భయంతోనో, నిర్లక్ష్యంతోనో ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు తగిన స్క్రీనింగ్ పరీక్షలు, సమయానికి వైద్య సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం.
