Last Updated:
వంటల్లో ఉపయోగించిన ఉల్లిపాయ కింద ఉండే వేరు భాగాన్ని పారేయకుండా కుండీలో నాటి ఇంట్లోనే కొత్త మొక్కను పెంచుకోవచ్చు. ఉల్లిపాయ వేరు ముక్కను నాటే విధానం, ఎరువుల వాడకం, నీటి నిర్వహణతో పాటు కొత్త ఉల్లిపాయలు వచ్చే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.
మన వంటగదిలో ప్రతిరోజూ ఉపయోగించే కూరగాయల్లో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయను కోసేటప్పుడు కింద ఉండే వేరు భాగాన్ని చాలామంది పనికిరాదని చెత్తబుట్టలో పడేస్తుంటారు. అయితే ఆ చిన్న ముక్కతోనే ఇంట్లో కొత్త ఉల్లిపాయ మొక్కను పెంచుకోవచ్చని మీకు తెలుసా? ఇందుకోసం ప్రత్యేకంగా విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ కింద ఉండే వేరు భాగాన్ని సరైన పద్ధతిలో కుండీలో నాటితే కొత్త మొక్కను పెంచుకోవచ్చు. గార్డెనర్ రామ్ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉల్లిపాయను ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.
ఉల్లిపాయ వేరు భాగాన్ని కుండీలో ఎలా నాటాలి?
ముందుగా ఉల్లిపాయ కింద ఉండే వేరుతో కూడిన భాగాన్ని కొద్దిగా ఉల్లిపాయ ముక్క మిగిలేలా కత్తిరించాలి. వేర్లు పూర్తిగా దెబ్బతినకుండా జాగ్రత్తపడాలి. ఇప్పుడు ఒక కుండీలో మట్టిని నింపి, ఉల్లిపాయ వేరు భాగాన్ని కిందివైపు ఉండేలా మట్టిలో నాటాలి. దానిపై కొద్దిగా మట్టి కప్పి తేలికగా నీరు పోయాలి. కొన్ని రోజుల తర్వాత ఆ ముక్క నుంచి పచ్చటి ఆకులు మొలకెత్తడం ప్రారంభిస్తాయి.
మొక్క ఏపుగా పెరగాలంటే ఎరువులు వేయాలి: ఉల్లిపాయ మొక్క నాటిన తర్వాత దాని ఎదుగుదలపై శ్రద్ధ పెట్టాలి. మొక్కకు అవసరమైన పోషకాలు అందించేందుకు కుండీలోని మట్టిలో ఎప్పటికప్పుడు వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువు లేదా ఎండిన ఆకులతో తయారు చేసిన సేంద్రియ ఎరువులు కలపాలి. వీటివల్ల మొక్క పెరుగుదలకు అవసరమైన పోషకాలు అందుతాయి. ఎరువులు వేసేటప్పుడు మట్టిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి.
నీరు పోసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి: ఉల్లిపాయ మొక్క ఆరోగ్యంగా పెరగడానికి నీరు అవసరం. అందుకే ఎప్పటికప్పుడు మట్టిలో తేమను పరిశీలిస్తూ నీరు పోయాలి. అయితే కుండీలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడాలి. నీరు ఎక్కువగా నిలిచిపోతే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి మట్టిని తేలికగా వదులు చేయాలి. ఇలా చేయడం వల్ల మట్టి గట్టిపడకుండా ఉంటుంది. మొక్క వేర్లు విస్తరించేందుకు కూడా అనుకూలంగా ఉంటుంది.
ఉల్లిపాయ మొక్క పెరిగే కొద్దీ దాని కింద వేర్ల దగ్గర ఉల్లిపాయ బల్బ్ క్రమంగా పరిమాణంలో పెరుగుతుంది. అదే కొత్త ఉల్లిపాయగా తయారవుతుంది. ఈ సమయంలో మొక్కకు వచ్చే పచ్చటి ఆకులను కోయకూడదు. ఎందుకంటే మొక్కకు అవసరమైన పోషకాలను తయారు చేసుకోవడంలో ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి.
ఒకవేళ మొక్కకు పూలు లేదా విత్తనాలు వచ్చే కాండం కనిపిస్తే దానిని తొలగించాలని గార్డెనర్ సూచిస్తున్నారు. కొంతకాలానికి కింద ఏర్పడిన ఉల్లిపాయ పరిమాణం పెరిగి, ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోవడం ప్రారంభిస్తాయి. ఇది ఉల్లిపాయ కోతకు సిద్ధమవుతోందని తెలిపే సూచన.
చివరిగా.. వంటగదిలో ఉల్లిపాయను ఉపయోగించిన తర్వాత దాని వేరు భాగాన్ని పారేయకుండా కుండీలో నాటండి. సరైన మట్టి, నీరు, ఎరువులు అందిస్తే ఇంట్లోనే ఉల్లిపాయ మొక్కను పెంచుకోవచ్చు. బాల్కనీ లేదా చిన్న గార్డెన్ ఉన్నవారు ఈ పద్ధతిని ప్రయత్నించవచ్చు.

