Last Updated:
అమెరికా కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు సెనేట్‌ను చేజిక్కించుకోవడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఈ రాజకీయ పరిణామం భారత్ వాణిజ్యం, హెచ్-1బీ వీసాలు, వ్యూహాత్మక సంబంధాలపై చూపే ప్రభావంపై సర్వత్రా చర్చ సాగుతోంది.
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎగువ సభ అయిన సెనేట్‌లో డెమొక్రాట్లు ఘనవిజయం సాధించి మెజారిటీని సొంతం చేసుకున్నారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోనూ తీవ్ర పోటీ నడుస్తుండటంతో వాషింగ్టన్‌లో సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. తన పదవీకాలంలో మిగిలిన రెండేళ్ల పాలనలో ట్రంప్ తీసుకునే విధానపరమైన నిర్ణయాలపై కాంగ్రెస్ నిఘా, నియంత్రణ భారీగా పెరగనున్నాయి. ఈ అధికార సమతుల్యతలో మార్పు నేరుగా భారత్‌తో సంబంధాలపై ప్రభావం చూపనుంది.
ఇరు దేశాల మధ్య ఉన్న సుంకాల విధానం, నిపుణులైన ఉద్యోగుల వీసా నిబంధనలు, రక్షణ సాంకేతిక సహకారం వంటి కీలక అంశాలపై అమెరికా కాంగ్రెస్ తీసుకునే వైఖరి అత్యంత కీలకం కానుంది. అయితే సెనేట్ చేతులు మారినంత మాత్రాన అధ్యక్షుడి విశేషాధికారాల దృష్ట్యా రాత్రికి రాత్రే విధానాలు మారిపోవని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
భారత్ ప్రధానంగా ఆందోళన చెందుతున్న అంశాల్లో వాణిజ్య సుంకాలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. భారతీయ వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం 18 శాతం వరకు పరస్పర సుంకాలను విధించే ప్రతిపాదనలు తీసుకురావడంతో ఫార్మా, టెక్స్‌టైల్, ఇంజినీరింగ్ ఎగుమతిదారులు తీవ్ర సందిగ్ధంలో పడ్డారు. ఇప్పుడు సెనేట్ డెమొక్రాట్ల చేతుల్లోకి రావడంతో ట్రంప్ అనుసరిస్తున్న సుంకాల దూకుడుపై కాంగ్రెస్ కమిటీల ద్వారా ప్రశ్నించే అవకాశం లభిస్తుంది. అయితే వాణిజ్య పన్నులు విధించే అధికారాలు చట్టపరంగా అధ్యక్షుడి వద్దే ఉండటంతో భారత ఉత్పత్తులకు తక్షణ ఊరట లభిస్తుందని చెప్పలేము.
అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులకు హెచ్-1బీ వీసా విధానాలు ఎంతో ముఖ్యం. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ట్రంప్ యంత్రాంగం కొత్త వీసా దరఖాస్తులపై ఏకంగా లక్ష డాలర్ల ఫీజు విధించేందుకు చేసిన ప్రయత్నాలను అక్కడి ఫెడరల్ కోర్టులు అడ్డుకున్నాయి. సెనేట్‌లో మెజారిటీ సాధించిన డెమొక్రాట్లు విదేశీ నిపుణులపై విధించే అనవసర ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. అమెరికన్ టెక్ కంపెనీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీసా నిబంధనల్లో సడలింపుల కోసం ప్రయత్నించవచ్చు. కానీ సమగ్ర వలస చట్టాల మార్పులు లేకుండా కార్యనిర్వాహక స్థాయిలో త్వరితగతిన మార్పులు రావడం అంత సులువు కాదు.
రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, కీలక సాంకేతిక పరిజ్ఞాన బదిలీ వంటి రంగాల్లో భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అత్యంత బలంగా ఉంది. రక్షణ బడ్జెట్ ఆమోదం, ఆయుధ విక్రయాల ఒప్పందాల పరిశీలనలో సెనేట్ పాత్ర చాలా కీలకం. అయితే వాషింగ్టన్‌లో భారత్‌తో వ్యూహాత్మక మైత్రికి రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇరుపక్షాల నుంచీ సాంప్రదాయబద్ధంగా పూర్తి మద్దతు లభిస్తూనే ఉంది. కాబట్టి కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలు మారినప్పటికీ రక్షణ సంబంధాలలో ఎలాంటి పెద్ద ప్రతికూలతలు ఉండకపోవచ్చు.
రాబోయే రెండేళ్లపాటు వైట్‌హౌస్‌లో ఉండే ట్రంప్ పరిపాలనతో పాటు సెనేట్‌ను నడిపించే డెమొక్రాట్లను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం న్యూఢిల్లీ విదేశాంగ విధానానికి సరికొత్త పరీక్ష కానుంది. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను వేగవంతం చేస్తూనే కాంగ్రెస్ కమిటీలతో స్నేహపూర్వక సంప్రదింపులు జరపడం ద్వారా భారత ప్రయోజనాలను పరిరక్షించుకోవాల్సి ఉంటుంది.

