Last Updated:
30 ఏళ్ల క్రితం తీసుకున్న రూ.25 వేల అప్పును తీర్చడానికి కేరళకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ తెలంగాణకు వచ్చాడు. అతని నిజాయితీకి ప్రశంసలు.
ఈ రోజుల్లో ఎంత పెద్ద సహాయం చేసినా మరిచిపోయే మనుషులు చాలామందే కనిపిస్తుంటారు. కానీ మూడు దశాబ్దాల క్రితం తీసుకున్న అప్పును మరచిపోకుండా, ఎలాంటి అడ్రస్ లేకపోయినా వేల కిలోమీటర్లు ప్రయాణించి స్నేహితుడి ఇంటిని వెతికి మరీ తిరిగి చెల్లించిన ఓ వ్యక్తి నిజాయితీ ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కేరళకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ చేసిన ఈ పని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
సుమారు 30 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలో ఒకే గదిలో ఉండి పనిచేసిన కేరళకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుత జగిత్యాల జిల్లా) ధర్మపురి ప్రాంతానికి చెందిన ఎడ్ల లచ్చన్నతో స్నేహం ఏర్పడింది. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఇస్మాయిల్‌కు లచ్చన్న రూ.25 వేల సాయం చేశాడు. కాలం గడిచింది.. ఇద్దరూ తమ తమ జీవితాల్లో బిజీ అయ్యారు. కానీ లచ్చన్న చేసిన ఆ ఉపకారాన్ని మాత్రం ఇస్మాయిల్ ఎప్పటికీ మర్చిపోలేదు.
ఇటీవల ఆ అప్పు తీర్చాలని నిర్ణయించుకున్న ఇస్మాయిల్‌కు లచ్చన్న చిరునామా, ఫోన్ నంబర్, ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. అయినప్పటికీ అతనికి గుర్తున్న ఒక్క విషయం ధర్మపురి అనే గ్రామం పేరు మాత్రమే. అదే ఆధారంగా గూగుల్ మ్యాప్స్ సహాయంతో సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించి తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురికి చేరుకున్నాడు. అక్కడ స్థానికులను అడిగి అడిగి చివరకు లచ్చన్న ఇంటిని గుర్తించి చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే లచ్చన్న ప్రస్తుతం గల్ఫ్‌లోనే ఉండటంతో, అతనితో వీడియో కాల్లో మాట్లాడిన ఇస్మాయిల్ భావోద్వేగానికి గురయ్యాడు. మూడు దశాబ్దాల క్రితం తీసుకున్న రూ.25 వేల అప్పును లచ్చన్న కుటుంబ సభ్యులకు అందజేశాడు. ఈ విషయం తెలిసిన స్థానికులు ఇద్దరి స్నేహానికి, ఇస్మాయిల్ నిజాయితీకి ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటన విస్తృతంగా వైరల్ అవుతూ, నిజమైన స్నేహానికి ఇదే నిదర్శనమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా వీడియో కాల్ ద్వారా స్పందించిన ఎడ్ల లచ్చన్న, సౌదీలో ఐదేళ్ల పాటు ఒకే గదిలో ఉంటూ ఒకరి కష్టాలను మరొకరు పంచుకున్న రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో అవసరమైనప్పుడు ఒకరికొకరం సహాయం చేసుకునేవాళ్లమని, తాను ఇచ్చిన రూ.25 వేల సాయాన్ని 30 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకుని కేరళ నుంచి తెలంగాణకు వచ్చి తన కుటుంబానికి అందించడం జీవితాంతం మర్చిపోలేని అనుభూతి అని అన్నారు. ఇలాంటి నిజాయితీ గల స్నేహితుడు దొరకడం తన అదృష్టమని ఆయన భావోద్వేగంగా చెప్పారు.
స్వార్థం పెరిగిపోయిందని తరచూ వినిపించే ఈ కాలంలో, ఉపకారం చేసిన వారిని మరచిపోకుండా రుణం తీర్చుకోవడం ఎంత గొప్ప విలువో ఇస్మాయిల్ తన చేతలతో నిరూపించాడు. డబ్బు కంటే మనిషి విలువ, నమ్మకం, స్నేహం గొప్పవని ఈ సంఘటన మరోసారి చాటి చెప్పింది. మూడు దశాబ్దాల తర్వాత కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఈ ఇద్దరు స్నేహితుల కథ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Karimnagar,Telangana
Jul 16, 2026 10:31 PM IST
