Last Updated:
దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. దీపావళి కానుకగా అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి క్లాసిక్ హిట్స్ అందించిన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. దీపావళి కానుకగా అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో అంగరంగ వైభవంగా జరిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది.
ఈ వేడుకలో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే కామెంట్స్ చేశారు. ‘నువ్వు నాకు నచ్చావ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా అనగానే కథల ఎంపికలో ఒత్తిడి ఉంటుందని, కానీ ఈసారి కేవలం కామెడీ మాత్రమే కాకుండా థ్రిల్, సస్పెన్స్, ఎమోషన్స్‌తో కూడిన అద్భుతమైన స్క్రిప్ట్‌తో త్రివిక్రమ్ వచ్చాడని వెంకీ తెలిపారు. “కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి కథే ఈ ఆదర్శ కుటుంబం. ఇండియన్ క్రికెటర్లు స్టేడియంలో సిక్సర్లు బాదుతున్నట్టు.. ఈ సినిమాతో మేము థియేటర్లలో సిక్సర్లు కొట్టబోతున్నాం” అని వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు. తన కెరీర్ లోనే ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది అని అన్నారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక బలమైన గోడలా నిలబడిందని ప్రశంసించారు. రచయితగా ‘పవిత్ర బంధం’ సినిమాతో తనకి వెంకటేష్ గారే ఓనమాలు దిద్దించారని, ఆ తర్వాత తనను ఎంకరేజ్ చేసి దర్శకుడిగా తన ప్రయాణానికి పునాది వేశారని కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబం మనకి ఇవ్వబడుతుంది. స్నేహితులను మనం ఎంచుకుంటాం, అలాగే ప్రేమను కూడా మనమే ఎంచుకుంటాం. అలా ఒక కుటుంబం (చిట్టిబాబు, స్వర్ణ, సంపూర్ణ, సర్వ) అనే నలుగురు మనుషులు తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడ్డారు? తమ బంధాలు కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్ళారు? ఒక సామాన్యుడు తెగిస్తే ఎంతదూరం ప్రయాణం చేయగలడు? అది ఈ సినిమా కథ. ఫ్యామిలీ సినిమాలకు వెంకటేష్ గారే కేరాఫ్ అడ్రస్ అని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. అలాగే, ఏపీలో తుఫాను వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని భగవంతుడిని ప్రార్థించారు.
హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు వెల్లడించింది. వెంకటేష్, త్రివిక్రమ్ లాంటి దిగ్గజాలతో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. థమన్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలవడం, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

