Last Updated:
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 11, 12 తేదీల్లో కెనడాలో అధికారికంగా పర్యటించనున్నారని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెల్లడించారు.
భారత్, కెనడాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రతా రంగాల్లో పరస్పర సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయి. గురువారం కాల్గరీలోని ఓ రెస్టారెంట్లో సందర్శకులతో మాట్లాడిన సందర్భంగా ప్రధాని కార్నీ ఈ పర్యటన తేదీలను ధ్రువీకరించారు. రాబోయే పర్యటనపై తాను ప్రధాని మోదీతో అప్పుడే ఫోన్లో మాట్లాడానని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ టొరంటో, ఒట్టావా నగరాలను సందర్శిస్తారని, పర్యటన పరిధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. ఒట్టావాలోని భారత హైకమిషన్ కూడా ‘ఎక్స్’ వేదికగా డిసెంబర్ 11-12 పర్యటనను ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇరుదేశాల బంధంలో సానుకూల వాతావరణాన్ని కొనసాగిస్తూ, కీలక రంగాల్లో స్పష్టమైన ఫలితాలను సాధించేందుకు ఇరు దేశాధినేతలు అంగీకరించారని పేర్కొంది.
ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై చర్చలను ముగించి, ఆర్థిక సహకారాన్ని విస్తరించాలని ఇరుపక్షాలు పట్టుదలతో ఉన్నాయి. అయితే, పర్యటన తేదీలపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం పేర్కొంది. కెనడా విదేశాంగ మంత్రి కొన్ని రోజుల క్రితం భారత్‌ను సందర్శించి, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో పాటు ప్రధాని మోదీతోనూ భేటీ అయ్యారని, ఆ సమయంలో మోదీ కెనడా పర్యటన ప్రస్తావనకు వచ్చిందని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. పర్యటన తేదీలపై సంప్రదింపులు జరుగుతున్నాయని, తగిన సమయంలో అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.
2026 చివరి నాటికి CEPA చర్చలను కొలిక్కి తేవాలని, 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. న్యూఢిల్లీలో మోదీతో జరిగిన భేటీలో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ వాణిజ్య ఒప్పందం, పెట్టుబడులు, విద్య, ఇంధనం, భద్రత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. కెనడా ఇంటర్నేషనల్ ట్రేడ్ మినిస్టర్ మనీందర్ సిద్ధూ నేతృత్వంలో కొనసాగుతున్న ‘టీమ్ కెనడా ట్రేడ్ మిషన్’ ఈ భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
అనితా ఆనంద్‌తో సమావేశం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ చర్చలు ఫలవంతంగా సాగాయని చెప్పారు. ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్మాణాత్మక, భవిష్యత్ కార్యాచరణతో కూడిన భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అనితా ఆనంద్ కూడా స్పందిస్తూ, కలిసికట్టుగా సంపన్నమైన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అపారమైన సామర్థ్యం భారత్-కెనడాలకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే డిసెంబర్లో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు కెనడా ఎదురుచూస్తోందని ఆమె తెలిపారు.

