మొబైల్స్ చోరీ కేసులో నిందితున్ని అరెస్టు చేసిన మఠంపల్లి పోలీసులు.
ప్రభ న్యూస్ | హుజూర్ నగర్ | అక్టోబర్ 16 :
మఠంపల్లి మండల కేంద్రంలో మొబైల్ షాపులో దొంగతనానికి పాల్పడిన నిందితుడిని మఠంపల్లి పోలీసులు అరెస్ట్ చేసినారు, అతని వద్ద నుండి ₹80,000 విలువైన 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు హుజూర్ నగర్ సీఐ చరమందరాజు తెలిపారు.
కేసు వివరాలు:
గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన డ్రైవర్ వృత్తి చేసుకొనే చక్రవర్తి (అలియాస్ బాబు) అనే వ్యక్తి రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లు, షాపులను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతుంటాడు.
ఇతనిపై గతంలో ఎల్బీనగర్ లో ఒకటి, చైతన్యపురిలో ఒకటి మరియు కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు నమోదు కాగా, 2023లో కోదాడ టౌన్ లోని 3 కేసులలో నిందితుడికి జైలు కు కూడా పంపడం జరిగినది. ఇటీవల మఠంపల్లిలోని ఒక మొబైల్ షాపులో ఇతడు దొంగతనానికి పాల్పడ్డాడు. దొంగిలించిన ఫోన్లను వేరే వ్యక్తులకు విక్రయించగా, ఆ ఫోన్లలో వేసిన కొత్త సిమ్ కార్డులు, కాల్ డేటా రికార్డ్స్ అనాలిసిస్ ఆధారంగా నిందితుడిని పోలీసులు సాంకేతికంగా గుర్తించారు.
మళ్లీ నేరానికి పాల్పడేందుకు మఠంపల్లికి వచ్చినట్లు పక్కా సమాచారం అందడంతో, పోలీసులు తనిఖీలు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి సుమారు ₹80,000 విలువ చేసే 6 స్మార్ట్ఫోన్లను రికవరీ చేసినట్లు సీఐ వెల్లడించారు. సిఐ చరమందరాజు వెంట మఠంపల్లి ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది ఉన్నారు.

