Last Updated:
Sky Diving: ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సాధించి, జీవితంలో స్థిరపడుతున్న తరుణంలో ఓ యువకుడిని విధి వెక్కిరించింది.
కొత్త ఉద్యోగంలో చేరడానికి కేవలం ఒక్క రోజు ముందు జరిగిన స్కైడైవింగ్ ప్రమాదం ఓ తెలుగు కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం ఆరెంజ్ పట్టణంలో జరిగిన ఈ దుర్ఘటనలో విజయవాడకు చెందిన గడ్డం మణిచంద్ర తేజ (28) మృతి చెందారు.
ఈనాడు కథనం ప్రకారం.. మణిచంద్ర తేజ అమెరికాలోని ఆరెంజ్ పట్టణంలో ఉన్న ఒక స్కైడైవింగ్ కేంద్రంలో స్కైడైవింగ్ చేశారు. అయితే, ఆయన స్కైడైవింగ్ పూర్తి చేసి కిందకు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు నియంత్రణ కోల్పోయి దాదాపు 30 అడుగుల ఎత్తు నుండి ఆయన కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తేజ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
మణిచంద్ర తేజ విజయవాడ గ్రామీణ మండలం రామవరప్పాడుకు చెందిన గడ్డం ప్రసాద్, ఉమాదేవి దంపతుల కుమారుడు. చదువు నిమిత్తం వీరి కుటుంబం హైదరాబాద్కు నివాసం మార్చింది. హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేసిన తేజ, 2022లో ఉన్నత చదువుల (ఎమ్మెస్) కోసం అమెరికా వెళ్లారు. బోస్టన్లోని నార్త్ ఈస్ట్రన్ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్ పూర్తి చేసి, 2024 నుండి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల ఆయనకు ‘క్లావియా’ అనే ప్రముఖ సంస్థలో మరింత మంచి ఉద్యోగం లభించింది. సోమవారం ఉదయం ఆయన ఈ కొత్త కొలువులో చేరాల్సి ఉండగా, అంతకుముందు రోజు అనగా ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఆయన కన్నుమూశారు.
తేజ ఉన్నత చదువుల కోసం ఆయన తల్లిదండ్రులు హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో దాదాపు రూ. 50 లక్షల వరకు విద్యా రుణం (ఎడ్యుకేషన్ లోన్) తీసుకున్నారు. కొడుకు మంచి ఉద్యోగంలో చేరాడని, త్వరలోనే అప్పులన్నీ తీరిపోతాయని ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకు ఈ వార్త కోలుకోలేని దెబ్బ తీసింది. అందివచ్చిన కొడుకు ఇక లేడనే చేదు నిజం తెలుసుకుని వారు గుండెలవిసేలా విలపిస్తున్నారు.
ప్రస్తుతం మణిచంద్ర తేజ భౌతికకాయాన్ని భారతదేశానికి, ముఖ్యంగా హైదరాబాద్కు తీసుకురావడానికి అమెరికాలోని ఆయన స్నేహితులు, బంధువులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన ఖర్చుల నిమిత్తం అక్కడ ఫండ్ రైజింగ్ (విరాళాల సేకరణ) కూడా ప్రారంభించారు.
Hyderabad,Telangana

