Last Updated:
ఉన్నంతలో సొంత ఇంటిని కట్టుకొని అందులో తలదాచుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ సొంతింటి కలను సాకారం చేసుకోవడం అందరి వల్ల సాధ్యపడకపోవచ్చు. కానీ ఓ దివ్యాంగురాలి సొంతింటి కలను సాకారం చేసిన జిల్లా అధికారికి ఆమె రాఖీ కట్టి తన కృతజ్ఞతను, సోదరభావాన్ని ప్రకటించుకున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణంగా వినతిపత్రాలు, సమస్యలు, ఫిర్యాదులతో వచ్చే ప్రజలనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో మాత్రం అందుకు భిన్నమైన, హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. తన జీవితకాల కోరిక అయిన సొంతింటి కలను నెరవేర్చిన జిల్లా కలెక్టర్‌కు ఓ దివ్యాంగురాలు వెండితో చేసిన రాఖీ కట్టి కృతజ్ఞతను తెలియజేశారు. ఆప్యాయత, అభిమానానికి ప్రతీకగా జరిగిన ఈ అరుదైన ఘటన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసింది.
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం జాతర్ల గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్‌కు చెందిన ఉయికె సుభద్ర మరుగుజ్జు దివ్యాంగురాలు. సొంత ఇల్లు నిర్మించుకోవాలనే ఆమె చిరకాల కలను నెరవేర్చుకోవడానికి గతంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషాను కలిసి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేశారు. ఆమె పరిస్థితిని గుర్తించిన కలెక్టర్ ఇందిరమ్మ గృహాన్ని మంజూరు చేయడమే కాకుండా, ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు అవసరమైన సహకారం అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిసింది.
సొంతింటిలోకి అడుగుపెట్టిన తర్వాత తన కల నెరవేరడానికి కారణమైన కలెక్టర్‌కు కృతజ్ఞతలు చెప్పాలని భావించిన సుభద్ర, జిల్లా కేంద్రానికి ప్రత్యేకంగా వచ్చి ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిశారు. తన వెంట తీసుకొచ్చిన వెండితో చేసిన రాఖీని ఆయన చేతికి కట్టి, మెడలో కండువా కప్పి సోదరభావాన్ని చాటుకున్నారు. తన జీవితంలో అన్నలా అండగా నిలబడి సొంతింటి కలను నిజం చేశారని కలెక్టర్‌పై ఆమె కృతజ్ఞతాభావం వ్యక్తం చేశారు.
ఈ అపూర్వ ఘటనతో ఒక్కసారిగా సమావేశ మందిరం భావోద్వేగ వాతావరణంగా మారింది. అక్కడికి వచ్చిన అధికారులు, ప్రజలు కూడా ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. సుభద్ర చూపిన అభిమానానికి స్పందించిన కలెక్టర్ రాజర్షిషా కూడా ఆమెకు ఆత్మీయంగా అభివాదం తెలిపారు. ప్రజల జీవితాల్లో ఇలాంటి సంతోషకరమైన మార్పు తీసుకురావడం తన విధిలో భాగమే అయినప్పటికీ, ఈ సంఘటన మాత్రం తన ఉద్యోగ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
ప్రజలకు సేవ చేయడం ఒక అధికారికి విధి అయితే, ఆ సేవను గుర్తించి ప్రజలు చూపే ప్రేమ, గౌరవం అతిపెద్ద పురస్కారం అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఒక ప్రభుత్వ పథకం ద్వారా దివ్యాంగురాలి సొంతింటి కల నెరవేరగా, ఆమె కృతజ్ఞతగా కలెక్టర్‌కు రాఖీ కట్టడం ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికారి–ప్రజల మధ్య ఆత్మీయ అనుబంధానికి ఈ ఘటన ఒక అందమైన ఉదాహరణగా నిలిచింది.
Warangal,Telangana
