పీఎం-కుసుమ్ పథకం ప్రధాన ఉద్దేశం వ్యవసాయంలో డీజిల్ వినియోగాన్ని తగ్గించడం, సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడం, రైతుల ఆదాయ అవకాశాలను మెరుగుపరచడం. ఈ పథకం ద్వారా స్వతంత్ర సోలార్ పంపులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటికే విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానమైన వ్యవసాయ పంపులకు సోలార్ వ్యవస్థలను కూడా జోడించుకోవచ్చు. ఇవే కాకుండా, బంజరు లేదా సాగు చేయకుండా వదిలేసిన భూముల్లో గరిష్ఠంగా 2 మెగావాట్ల సామర్థ్యం ఉన్న గ్రిడ్‌కు అనుసంధానమైన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే అవకాశమూ ఉంది. ఇలా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను స్థానిక డిస్కమ్‌లకు విక్రయించవచ్చు. ఇందుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ నిర్ణయించిన ధరలు వర్తిస్తాయి. మొత్తంగా, పీఎం-కుసుమ్ పథకంలోని బి, సి విభాగాలు రైతులకు సోలార్ పంపుల ఏర్పాటు, సబ్సిడీ, బ్యాంకు రుణం, అదనపు ఆదాయం సంపాదించే అవకాశాలను అందిస్తున్నాయి. దీనివల్ల సాగు కోసం డీజిల్‌పై ఆధారపడటం తగ్గడంతో పాటు, నీటి పారుదల ఖర్చులను నియంత్రించుకోవడానికి వీలవుతుంది. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, రుణ వివరాలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాల గురించి తెలుసుకోవాలనుకునే రైతులు అధికారిక పీఎం-కుసుమ్ వెబ్సైట్ https://pmkusum.mnre.gov.in ను సందర్శించవచ్చు. లేదా తమకు సమీపంలోని ఎస్బీఐ శాఖను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
