Last Updated:
Visakhapatnam: కమిషనర్ ఆదేశాల విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవెలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ)లో ఏకంగా రూ. 70 కోట్ల నిధుల ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
ఉన్నతాధికారుల స్పష్టమైన ఆదేశాలను పక్కనబెట్టి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కొందరు అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనాడు కథనం ప్రకారం.. కొన్ని నెలల కిందట వీఎంఆర్డీఏకు ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 75 కోట్ల నిధులు వెనక్కి వచ్చాయి. ఈ సొమ్మును భవిష్యత్తు అవసరాల కోసం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకుల్లో ఎఫ్డీ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా, విశాఖపట్నంలోని వెంకోజీపాలెంలో ఉన్న ఒక నిర్దిష్ట బ్యాంకు శాఖలో ఈ నిధులను డిపాజిట్ చేయాలని వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ అకౌంటింగ్ విభాగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
అయితే, సదరు లావాదేవీలు నిర్వహించే అధికారులు కమిషనర్ ఆదేశాలను పెడచెవిన పెట్టారు. ఆ నిధులను విశాఖలో కాకుండా, సంస్థ పరిధికి ఏమాత్రం సంబంధం లేని రాజమహేంద్రవరంలోని ఓ బ్యాంకు శాఖలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఇన్ని కోట్ల రూపాయలను ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా వేరే నగరానికి మార్చడం చర్చనీయాంశంగా మారింది.
ఈ వ్యవహారం బయటపడటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. విశాఖలోని బ్యాంకు శాఖలో సాంకేతిక సమస్య రావడం వల్లే రాజమహేంద్రవరంలో డిపాజిట్ చేయాల్సి వచ్చిందని బ్యాంకు అధికారులు సమర్థించుకుంటున్నప్పటికీ, అది వాస్తవం కాదని పలువురు ఆరోపిస్తున్నారు. రాజమహేంద్రవరంలోని బ్యాంకు అధికారులతో వీఎంఆర్డీఏలోని ఓ కీలక అధికారికి ఉన్న వ్యక్తిగత స్నేహం వల్లే ఈ నిధులను అక్కడికి తరలించారనే విమర్శలు వస్తున్నాయి. కాగా, వివాదం ముదరడంతో ప్రస్తుతం ఆ నిధులను తిరిగి విశాఖలోని బ్యాంకు శాఖకు మార్చేసినట్లు సమాచారం.
ఈ మొత్తం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ సమగ్ర విచారణకు ఆదేశించారు. అదనపు కమిషనర్ కీర్తిని విచారణాధికారిగా నియమించి, అసలు నిధులను ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలపై నివేదిక కోరారు.
ఇందులో భాగంగా ఉన్నతాధికారులు వీఎంఆర్డీఏ కార్యాలయం 8వ అంతస్తులోని అకౌంటింగ్ విభాగంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, ముఖ్యమైన దస్త్రాలను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ విచారణ అనంతరం బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Hyderabad,Telangana

