చక్కెర ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
2026-27 చక్కెర సీజన్ ప్రారంభానికి ముందు దేశంలో అందుబాటులో ఉన్న ప్రారంభ నిల్వలు తక్కువగా ఉండటంతో మార్కెట్లో సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. దీనికి తోడు పండుగల సీజన్ దగ్గరపడటంతో చక్కెరకు డిమాండ్ కూడా పెరుగుతోంది. సాధారణంగా గణేష్ చతుర్థి, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల కారణంగా ఆగస్టు నుంచి నవంబర్ వరకు చక్కెర వినియోగం గణనీయంగా పెరుగుతుంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా సగటు ఎక్స్-మిల్ చక్కెర ధర మంగళవారం నాటికి క్వింటాల్‌కు రూ.5,400-5,500 స్థాయికి చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో ఈ ధర సుమారు రూ.3,900గా ఉండేది. అంటే ఏడాది వ్యవధిలో ఎక్స్-మిల్ ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. రిటైల్ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, చక్కెర రిటైల్ ధర ఏడాది వ్యవధిలో సుమారు 13 శాతం పెరిగింది. ఆగస్టు 18 నాటికి కిలో చక్కెర సగటు ధర రూ.46.34 నుంచి రూ.52.30కు పెరిగింది. దీంతో సాధారణ వినియోగదారులతో పాటు మిఠాయి తయారీదారులు, హోటళ్లు, ఆహార పరిశ్రమలపై కూడా అదనపు భారం పడుతోంది.
