Last Updated:
మూవీ చూస్తూ ఏదైనా క్రిస్పీగా తినాలనిపిస్తోంది.. కానీ ఇంట్లో పాప్‌కార్న్ కోసం మొక్కజొన్న కూడా లేదు. కిచెన్‌లో చూస్తే ఆలుగడ్డలు మాత్రమే ఉన్నాయి. మరి ఆలుగడ్డలతో పాప్‌కార్న్ ఎలా తయారు చేయాలి? పూర్తి రెసిపీ తెలుసుకోండి.
సినిమా చూడటం మొదలుపెట్టగానే ఏదైనా క్రిస్పీగా తినాలనిపిస్తే.. ఇంట్లో ఉన్న ఆలుగడ్డలతోనే రుచికరమైన స్నాక్ తయారు చేసుకోవచ్చు. సాధారణంగా పాప్‌కార్న్ అంటే మొక్కజొన్నతో చేసేదే గుర్తుకొస్తుంది. కానీ ఆలుగడ్డలతో తయారు చేసే ఆలూ పాప్‌కార్న్ రుచి, టెక్స్చర్‌లో ప్రత్యేకంగా ఉంటుంది. ఉడికించిన ఆలుగడ్డలను చీజ్, పచ్చిమిర్చి, మసాలాలతో కలిపి చిన్న బంతులుగా చేసి, బ్రెడ్ క్రంబ్స్తో కోటింగ్ ఇస్తే చాలు. వీటిని డీప్ ఫ్రై చేయడంతో పాటు ఎయిర్ ఫ్రైయర్, ఓవెన్‌లోనూ తయారు చేసుకోవచ్చు.
ఆలూ పాప్‌కార్న్ కోసం ఒక పెద్ద ఆలుగడ్డ లేదా రెండు చిన్న ఆలుగడ్డలు, ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే ఒక చీజ్ స్లైస్ లేదా సుమారు పావు కప్పు తురిమిన మోజరెల్లా చీజ్, ఒరేగానో, చిల్లీ ఫ్లేక్స్, తగినంత ఉప్పు అవసరం. కోటింగ్ కోసం సుమారు అర కప్పు కార్న్‌ఫ్లోర్, అవసరమైనంత నీరు, ఒక కప్పు బ్రెడ్ క్రంబ్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. డీప్ ఫ్రై చేయాలనుకుంటే నూనె తీసుకోవాలి. తక్కువ నూనెతో తయారు చేయాలంటే ఎయిర్ ఫ్రైయర్ లేదా ఓవెన్ ఉపయోగించవచ్చు.
ముందుగా ఆలుగడ్డలను కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసి ఎలాంటి పెద్ద ముక్కలు లేకుండా మెత్తగా మెదపాలి. అనంతరం అందులో చీజ్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒరేగానో, చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడా ఉప్పు కలపాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా ఇందులో వేయవచ్చు. అన్నింటినీ బాగా కలిపి, చేతిలోకి తీసుకున్నప్పుడు చెదిరిపోని విధంగా మృదువైన మిశ్రమాన్ని సిద్ధం చేయాలి.
ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్ తీసుకుని కొద్దికొద్దిగా నీరు పోస్తూ చిక్కటి ద్రావణంలా కలపాలి. కావాలంటే కొద్దిగా ఉప్పు వేయవచ్చు. మరో గిన్నెలో బ్రెడ్ క్రంబ్స్ పెట్టుకోవాలి. ఆలూ మిశ్రమంతో చిన్న బంతులు తయారు చేసి ముందుగా కార్న్‌ఫ్లోర్ ద్రావణంలో ముంచాలి. వెంటనే బ్రెడ్ క్రంబ్స్‌లో వేసి అన్ని వైపులా సమానంగా కోటింగ్ చేయాలి.
కడాయిలో నూనెను మధ్యస్థ మంటపై వేడి చేసి ఆలూ బంతులను నెమ్మదిగా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. కడాయిలో ఎక్కువ బంతులను ఒకేసారి వేయకుండా జాగ్రత్తపడాలి. డీప్ ఫ్రై చేయకూడదనుకుంటే బంతులపై కొద్దిగా నూనె రాసి ఎయిర్ ఫ్రైయర్ లేదా ఓవెన్లో ఉడికించవచ్చు. సమయం, ఉష్ణోగ్రత పరికరాన్ని బట్టి మారవచ్చు కాబట్టి మధ్యలో పరిశీలించడం మంచిది.
వేడి వేడిగా సిద్ధమైన ఆలూ పాప్‌కార్న్‌ను టొమాటో కెచప్, చీజ్ డిప్ లేదా ఇష్టమైన చట్నీతో వడ్డించవచ్చు. బయట క్రిస్పీగా, లోపల చీజీగా ఉండే ఈ ఆలూ బంతులు మూవీ నైట్, సాయంత్రం పార్టీ లేదా అకస్మాత్తుగా వచ్చిన అతిథులకు మంచి స్నాక్‌గా ఉపయోగపడతాయి.

